ఢిల్లీ (మెట్రో న్యూస్):
- అక్రమించిన భూముల్లో శ్రీకాంతాచారి
అమరవీరుల కాలనీ నిర్మిస్తాం - ఢిల్లీ ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మియాపూర్లో రూ. 50 వేల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా ప్రయత్నించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చిందని తెలిపారు. శుక్రవారం నాడు ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన ప్రెస్మీట్లో సీఎం మాట్లాడుతూ, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని విలువైన భూములు కబ్జాకు ప్రయత్నించారన్నారు.
ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా వారి కబ్జా వ్యవహారాలపై పోరాడినందుకు కక్ష గట్టి తనను జైలుకు పంపారని గుర్తుచేశారు. ఇప్పటికైనా కేసీఆర్ ముఠా లక్షలాది కోట్ల విలువైన ప్రభుత్వ భూముల కబ్జాల వీడాలని డిమాండ్ చేశారు. రెండు గ్రామాల మధ్య వివాదాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకున్నారని, ఆక్రమించిన భూముల్లో శ్రీకాంతాచారి అమరుల కాలనీ నిర్మిస్తాం అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికైనా బుద్ది మార్చుకుని, ఆక్రమణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

తమ ప్రభుత్వం వచ్చాక రూ. 1.50 లక్షల కోట్ల విలువైన భూములు రక్షించాం అని ముఖ్యమంత్రి చెప్పారు.
వనరుల సమీకరణకు నియమించిన మంత్రివర్గం ఉప సంఘం ఈ భూముల విక్రయం.. వచ్చే ఆ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై అధ్యయనం చేస్తుందన్నారు. భూముల ఆక్రమణపై బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారు. శాసనసభ లో చర్చించి చర్యలకు దిగితే తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. మియాపూర్ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఎందుకు బీఆర్ఎస్ నాయకులు స్పందించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి పై కేసులు వేశారో వారితో కేసీఆర్, హరీశ్ రావు లాలూచీ పడ్డారు. మియాపూర్ భూములపై ఇప్పటికైనా కుట్రలు మానాలి. మియాపూర్ భూముల విక్రయంతో వచ్చే నిధులను విద్యాభివృద్ధికి వినియోగిస్తాం. వాళ్ల భూముల ఆక్రమణలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సీఎం డిమాండ్ చేశారు.