మెట్రో న్యూస్
కరీంనగర్:
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. గ్రామాల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో తాగునీరు, విద్యుత్తు సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై ప్రతి గురువారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని వెల్లడించారు.
ఎల్‌నినో నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ చిత్రా మిశ్రా మంగళవారం రాత్రి ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్యుత్తు, ఉద్యానవన, నీటిపారుదల, మత్స్యశాఖ, భూగర్భ జలాలు తదితర శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
*ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి*
ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు గ్రామాల వారీగా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను చైతన్యపరచాలని, తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్, కూరగాయలు, పండ్ల తోటల సాగుపై రైతులు దృష్టి సారించేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
*నీటి సంరక్షణకు ప్రాధాన్యం*
జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నీటి లభ్యత, అవసరాలను అంచనా వేసి గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని నీటిపారుదల, భూగర్భ జలాల శాఖల అధికారులకు సూచించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్ల నిర్మాణానికి రైతులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు వాటి సంరక్షణకు ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. మత్స్య సంపద అభివృద్ధిలో భాగంగా చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
*విద్యుత్తు వినియోగంపై అవగాహన*
రాబోయే రోజుల్లో విద్యుత్తు వినియోగం, డిమాండ్ పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
*ప్రతి గురువారం సమీక్ష*
ప్రతి గురువారం నిర్వహించే సమీక్ష సమావేశానికి అధికారులు పక్కా ప్రణాళికలతో, సమగ్ర సమాచారంతో హాజరు కావాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. గ్రామాల వారీగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికల అమలు పురోగతిని సమీక్షిస్తామని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడుతూ, ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.