హైదరాబాద్ (మెట్రో న్యూస్):
కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు, స్వతంత్రతపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజల్లో విశ్వసనీయతను కాపాడలేకపోతే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి వెన్నెముక.. అధికారంలో ఉన్నవాళ్లకు రక్షణ కవచం కాదు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయినప్పుడు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు.. సీఈసీ పదవికి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి. ఓటర్ల హక్కులను కాలరాస్తే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమారే పూర్తి బాధ్యత వహించాలి. ఈసీ స్వతంత్రత, నియామకాలపై అనుమానాలు రావడం మన రాజ్యాంగ ప్రజాస్వామ్యానికే పెను ముప్పు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన పౌరుల నుంచి లాక్కునే హక్కు ఎవరికీ లేదు. ఆర్టికల్స్ 324, 325, 326 సహా ప్రజాప్రాతినిధ్య చట్టాల ప్రకారం ఎన్నికల వ్యవస్థ పూర్తిగా నిష్పాక్షికంగా, పారదర్శకంగా పనిచేయాలి. వ్యక్తులు, ప్రభుత్వాల కంటే కూడా ప్రజాస్వామ్యమే అత్యున్నతమైనది, గొప్పది. ఇక చాలు అంటూ సీఈసీ వైఖరిని మాజీ మంత్రి ఎండగట్టారు.