Take a fresh look at your lifestyle.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత

0 6

(మెట్రో న్యూస్) :

* రబీలో వరి సాగు చేయవద్దు
* తాగునీటి అవసరాలకు జూరాల నీళ్లు
* జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసి, పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల పరిధిలో చేపట్టాల్సిన భూసేకరణపై క్షుణ్ణంగా అధికారులతో మాట్లాడారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభమై చాలా ఏళ్లవుతున్నందున భూసేకరణ ఆలస్యం చేయడం తగదని చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే శాఖల అధికారులు సమన్వయంతో రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకుని భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు ముందుకెళ్లాలన్నారు. అవార్డు పూర్తయిన రైతులకు ఆలస్యం చేయకుండా సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూరాల రిజర్వాయర్ చుట్టుపక్కల పొలాలు ఉన్న రైతులు రబీలో వరి సాగు చేయకుండా ముందుగానే గ్రామసభలు నిర్వహించి అవగాహన కలిగించాలన్నారు. అనధికారికంగా మోటర్లు పెట్టి నీళ్లు పారించుకునే వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని జూరాల రిజర్వాయర్లో తగినంత నీటిని నిలువ చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. రబీలో రైతులు ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దని సూచించారు. తమ బోరు, బావుల్లో నీటి లభ్యత ఆధారంగా ఆరుతడి పంటలు సాగు చేయవచ్చని కలెక్టర్ తెలియజేశారు.సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, ఆర్డీవో శ్రీనివాసరావు, సర్వే ఏడి నూకరాజు, ఇరిగేషన్ ఈఈలు శ్రీనివాసులు, సంజీవ్ ప్రసాద్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.