మెట్రో న్యూస్ – దేవరకద్ర:
₹1,034 కోట్ల అభివృద్ధిపై కాంగ్రెస్ శ్రేణుల ప్రచారం.. గత పాలనపై ప్రశ్నల వర్షం!
దేవరకద్రలో రాజకీయ వేడి.. అభివృద్ధి లెక్కలపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆసక్తికర చర్చ
దేవరకద్ర నియోజకవర్గంలో పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగుతున్న వెయ్యి రోజుల పాలనకు మధ్య ఉన్న తేడా ఏమిటి? అభివృద్ధి పనుల విషయంలో ఎవరి పాలన ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చింది? ఇప్పుడు ఈ ప్రశ్నలే నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేస్తున్న ₹1,034 కోట్లకు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లెక్కలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రచారానికి పరిమితమా.. పనులతోనే సమాధానమా?
వెయ్యి రోజుల పాలనలోనే విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, విద్యుత్, పర్యాటకం, క్రీడలు, పరిపాలనా సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యే మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు, పదేళ్లపాటు అధికారంలో ఉన్నబిఆర్ఎస్,నియోజకవర్గానికి సాధించిన అభివృద్ధి ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. అయితే ఈ రెండు పాలనల పనితీరును పోల్చాలంటే గతంలో చేసిన పనులు, ప్రస్తుత పనుల పురోగతి, ఖర్చులు, ప్రజలకు అందిన ప్రయోజనాలను ఆధారాలతోపరిశీలించాల్సిన అవసరం ఉంది.
విద్య, వైద్యం.. భారీ ప్రణాళికలు
₹200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ₹50 కోట్ల కౌకుంట్ల తెలంగాణ మోడల్ స్కూల్, దేవరకద్రలో డిగ్రీ కళాశాల, చిన్నచింతకుంటలో జూనియర్ కళాశాల, కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. అలాగే దేవరకద్రలో 100 పడకల ఆసుపత్రి, కొత్తకోటలో 50 పడకల ఆసుపత్రి, కౌకుంట్ల, చిన్నచింతకుంటల్లో 30 పడకల ఆసుపత్రుల ఏర్పాటు వైద్య సేవల విస్తరణకు దోహదపడతాయని పేర్కొంటున్నాయి.
సాగునీటి లెక్కలతో రాజకీయ సవాల్!
అజిలాపూర్ లెఫ్ట్ ఇరిగేషన్‌కు ₹32 కోట్లు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ పనులకు ₹93 కోట్లు, ఇస్రంపల్లిలో చెక్‌డ్యాంకు ₹10.50 కోట్లు వంటి పనులను ప్రస్తావిస్తూ రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యమని జిఎంఆర్ అనుచరులు వర్గాలు చెబుతున్నాయి. చౌదర్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్‌కు ₹90 కోట్లు, కోయిల్‌సాగర్ రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్‌కు ₹30 కోట్ల ప్రతిపాదనలు కూడా ఉన్నాయని,వివరిస్తున్నాయి.అయితే,ప్రతిపాదనలతో పాటు వాస్తవంగా మంజూరైన నిధులు, పూర్తయిన పనులు, సాగులోకి వచ్చిన ఆయకట్టు వివరాలు బయటపెడితేనే అభివృద్ధిపై పూర్తి స్పష్టత వస్తుందనే అభిప్రాయాలు,వ్యక్తమవుతున్నాయి.
రోడ్లు, విద్యుత్, పర్యాటకంపై ఫోకస్
కురుమూర్తి ఘాట్ రోడ్డుకు ₹110 కోట్లు, పలమర్రి–ముచ్చింతల హై లెవల్ బ్రిడ్జికి ₹56 కోట్లు, వివిధ పథకాల కింద బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ₹72 కోట్లతో 13 విద్యుత్ సబ్స్టేషన్లు వంటి పనులు నియోజకవర్గ అభివృద్ధిలో కీలకమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కోయిల్‌సాగర్ పర్యాటక అభివృద్ధికి ₹9.50 కోట్లు, కురుమూర్తి ఆలయంలో సదుపాయాలు, దేవరకద్రలో ₹10.50 కోట్ల స్టేడియం, కొత్తకోటలో ₹2 కోట్ల ఇండోర్ స్టేడియం వంటి అంశాలను కూడా తమ పనితీరుకు నిదర్శనంగా చూపుతున్నాయి.
2034 లక్ష్యం.. రాజకీయంగా ముందస్తు సంకేతమా?
దేవరకద్ర మున్సిపాలిటీ ఏర్పాటు, జూనియర్ సివిల్ జడ్జి–జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, అడ్డాకులలో వ్యవసాయ మార్కెట్,వంటికార్యక్రమాలతో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే మద్దతుదారులు వాదిస్తున్నారు. వెయ్యి రోజుల అభివృద్ధి కేవలం ఆరంభమేనని, 2034 నాటికి దేవరకద్ర రూపురేఖలు మార్చడమే లక్ష్యమని ప్రచారం చేస్తున్నారు. మరో పదేళ్లపాటు జిఎంఆర్ ఎమ్మెల్యేగా కొనసాగితే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు.
అసలు పరీక్ష ప్రజాక్షేత్రంలోనే!
అభివృద్ధి పనుల జాబితా రాజకీయ ప్రచారానికి ఆయుధంగా మారడం సహజమే. కానీ నిధుల ప్రకటనలు ఒక ఎత్తయితే, పనుల పూర్తి, నాణ్యత, ప్రజలకు అందిన ప్రయోజనాలు మరో ఎత్తు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో చేపట్టిన పనులను గణాంకాలు, అధికారిక రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా పోల్చితేనే వాస్తవ చిత్రం బయటపడుతుంది.
వెయ్యి రోజుల జిఎంఆర్ పాలనకు ప్రజల మద్దతు పెరుగుతోందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్న వేళ.. ఆ వాదనకు ప్రజాక్షేత్రంలో ఎలాంటి స్పందన లభిస్తుంది? గత పాలనతో పోలిస్తే ప్రస్తుత అభివృద్ధి ఎంత భిన్నంగా ఉంది? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పనుంది.