Take a fresh look at your lifestyle.

ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న ‘ఆర్నాబ్’ తుపాను.. 27, 28 తేదీల్లో కుంభవృష్టి!

0 8
  • బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
  • 27, 28 తేదీల్లో తీరం దాటే అవకాశం
  • ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు!
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారేందుకు సిద్ధమవుతోంది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఏర్పడుతున్న ఈ తొలి తుపానుకు ‘ఆర్నాబ్’ అని పేరు పెట్టనున్నారు. ఇది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది శనివారం నాటికి వాయుగుండంగా, ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా మారి, సోమవారం (అక్టోబర్ 26) ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వైపునకు చేరుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.

తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని వాతావరణ నమూనాలు ఇది మరింత బలపడి తీవ్ర లేదా అతి తీవ్ర తుపానుగా మారవచ్చని సూచిస్తున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఒడిశా తీరంలోనూ ఇదే తరహాలో వర్షాలు పడతాయని హెచ్చరించారు.

ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సంబంధిత జిల్లాల యంత్రాంగాలను సిద్ధం చేశాయి. సముద్రం అలజడిగా ఉన్నందున, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఖరీఫ్ పంట కోత దశలో ఉన్నందున, రైతులు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు తుపాను కదలికలను నిరంతరం గమనిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని విడుదల చేస్తున్నారు. ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.