- కోలిండియా తరహాలో బేసిక్ వేతనాల పెంపు.. 1,800 మందికి ప్రయోజనం
- దసరాలోపు హామీని నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్( మెట్రో న్యూస్):-
సింగరేణి అధికారుల చిరకాల విజ్ఞప్తి మేరకు కోలిండియా తరహాలో వేతనాలు సవరించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్–1 నుంచి 7 వరకు పనిచేస్తున్న సుమారు 1,800 మంది అధికారులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పోట్రు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన బేసిక్ వేతనాలు 2017 జనవరి 1 నుంచి అమల్లోకి రానుండగా.. ఆర్థిక ప్రయోజనాలు మాత్రం సింగరేణి బోర్డు ఆమోదం తెలిపిన 2026 సెప్టెంబరు 25 నుంచి వర్తించనున్నాయి. పెరిగిన వేతనాలను అక్టోబరు నెల జీతాల నుంచి చెల్లించనున్నారు. కొత్త వేతన సవరణతో ఈ1 క్యాడర్ బేసిక్ వేతనం రూ.40 వేల నుంచి రూ.60 వేలకు, ఈ2 క్యాడర్ వేతనం రూ.50 వేల నుంచి రూ.70 వేలకు పెరగనుంది. ఈ3 క్యాడర్‌కు రూ.60 వేల నుంచి రూ.80 వేలకు, ఈ4 క్యాడర్‌కు రూ.70 వేల నుంచి రూ.90 వేలకు, ఈ5 క్యాడర్‌కు రూ.80 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఈ6 క్యాడర్ వేతనం రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షలకు, ఈ7 క్యాడర్ వేతనం రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలకు సవరించారు. కోలిండియా అధికారులకు అమలు చేస్తున్న వేతన విధానాన్ని తమకూ వర్తింపజేయాలని సింగరేణి అధికారులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన ఈ ఏడాది జులైలోనే దసరాలోపు శుభవార్త అందేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అధికారుల విజ్ఞప్తిపై సింగరేణి యాజమాన్యం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రతిపాదనలను పరిశీలించి బోర్డు ఆమోదంతో వేతన సవరణకు నిర్ణయం తీసుకుంది. తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సింగరేణి అధికారుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. వేతన సవరణతో సంతోషం వ్యక్తం చేసిన వారు రాష్ట్ర ఇంధన అవసరాల కోసం మరింత అంకితభావంతో పనిచేస్తూ బొగ్గు ఉత్పత్తి పెంపునకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల దసరా సందర్భంగా సింగరేణిలోని సుమారు 39 వేల మంది కార్మికులు, ఉద్యోగులకు రూ.596 కోట్ల బోనస్ ప్రకటించారు. కాంట్రాక్టు కార్మికుల శ్రమను గుర్తించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వారికి ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున బోనస్ అందించాలని నిర్ణయించారు. తాజాగా అధికారుల వేతన సవరణకు ఉత్తర్వులు జారీ కావడంతో సింగరేణి వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.