Take a fresh look at your lifestyle.

మ‌న విద్యుత్ తెలంగాణకే వినియోగించాలి రాజ‌స్థాన్‌తో ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకోవాలి ముఖ్యమంత్రికి హ‌రీశ్‌రావు లేఖ

0 19

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

సింగరేణి (జైపూర్) కరెంటును రాజస్థాన్‌కు కట్టబెట్టే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. మంచిర్యాల (జైపూర్) సింగరేణి విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే కరెంటును రాజస్థాన్‌కు తరలించే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుని, ఆ విద్యుత్‌ను వంద శాతం తెలంగాణ అవసరాలకే వినియోగించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. ఒకవైపు కరెంటు లేక రైతుల పంటలు కళ్లెదుటే ఎండిపోతుంటే, మరోవైపు మన రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేసేందుకు మీరు సిద్ధపడటం ప్రజా వ్యతిరేక చర్య కాక మరేమిటి? అని ప్ర‌శ్నించారు.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు కావాల్సిన బొగ్గు మన సింగరేణి గనుల్లోనే ఉంది. నడపడానికి కావాల్సిన నీళ్లు పక్కన ఉన్న గోదావరి నుంచే పుష్కలంగా అందుతాయి. బొగ్గు మనది, నీళ్లు మనవి, స్థలం మనది. అలాంటప్పుడు ఇక్కడ కొత్తగా చేపడుతున్న విస్తరణలో 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు కట్టబెట్టేలా జాయింట్ వెంచర్ ఒప్పందం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? మన బొగ్గు, మన నీళ్లు, మన ప్రాంతంలో తయారయ్యే కరెంటుపై హక్కు తెలంగాణదే కదా? అని మాజీ మంత్రి విమ‌ర్శించారు. రాజస్థాన్‌తో చేసుకున్న విద్యుత్ జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. జైపూర్‌లో ఉత్పత్తయ్యే 800 మెగావాట్ల విద్యుత్‌ను వంద శాతం తెలంగాణే వినియోగించుకునేలా రాష్ట్ర డిస్కంలతోనే అగ్రిమెంట్ చేసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.