హైదరాబాద్(మెట్రో న్యూస్) :
రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు కల్పించి, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు 5,68,858 పట్టాదారు పాస్‌బుక్కులు జారీ చేసినట్లు వెల్లడించారు. అంతకుముందు జారీ చేసిన 6,71,508 పాస్‌బుక్కులతో కలిపి మొత్తం 12,40,366 పాస్‌బుక్కులను రైతులకు అందించినట్లు పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో భూభారతి చట్టం అమలు, పాస్‌బుక్కుల పంపిణీ, భూముల రీ-సర్వే, భూ సమస్యల పరిష్కారంపై సమీక్షించారు.గత పదేళ్లలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దశాబ్దాలుగా భూములను సాగు చేస్తున్నప్పటికీ రికార్డుల్లో హక్కులు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమైన రైతులను గుర్తించేందుకు సమగ్ర రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. వాస్తవ సాగుదారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే ఈ ప్రక్రియ ఉద్దేశమన్నారు. ప్రభుత్వ విధానాలు, ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రెవెన్యూ గ్రామంలో రీ-సర్వే ద్వారా గిరిజనులు, గిరిజనేతరుల భూ సమస్యలను పరిష్కరించి 906 మంది రైతులకు 1,600 ఎకరాలకు పైగా భూమిపై హక్కులు కల్పించినట్లు మంత్రి వివరించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాల్లో 2,400 మంది రైతులకు 3,450 ఎకరాలకు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో రైతులకు బ్యాంకు రుణాలు, రైతుభరోసా, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం కలిగిందన్నారు. ములుగు జిల్లా ముల్కాపల్లి మండలంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, అశ్వారావుపేట, దమ్మపేట, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలాల్లో రీ-సర్వే పనులు కొనసాగుతున్నాయని, త్వరలో అర్హులకు పాస్‌బుక్కులు అందిస్తామని చెప్పారు.ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో రీ-సర్వే నిర్వహించి, ఏళ్ల తరబడి భూ హక్కుల కోసం ఎదురుచూస్తున్న వారికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లాలో ఫుడ్ పార్కు ఏర్పాటుపైనా కలెక్టర్‌తో మంత్రి చర్చించారు.