Take a fresh look at your lifestyle.

ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలి.

0 22

మెట్రో న్యూస్

  • ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 300 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి
  • -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.

ఎల్‌నినో నేపథ్యంలో రానున్న 300 రోజులు అత్యంత కీలకమని, తాగు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలని, ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా ఇప్పటి నుండే అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
గ్రామాలు, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో తాగునీటికి ఇబ్బంది రాకుండా వచ్చే ఆగస్టు వరకు నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
గ్రామపంచాయతీల్లో నీటి వనరులకు సంబంధించిన రిజిస్టర్లను నిర్వహించాలని, నీటి సరఫరా వ్యవస్థలో లీకేజీలను అరికట్టాలని, పాడైన పైపులు, ట్యాంకులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. పబ్లిక్ హెల్త్ శాఖ, మిషన్ భగీరథ, అమృత్ పథకం అధికారులతో సమన్వయం చేసుకొని నీటి సరఫరా ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోనూ నీటిని పొదుపుగా వినియోగించే విధానాలను అమలు చేయాలన్నారు.
వాహనాలను పైపులతో కడగకుండా బకెట్ నీటితో శుభ్రం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, దుకాణాలు, వాహనాల శుభ్రత కేంద్రాల్లోనూ నీటి వృథాను నివారించాలని ఆదేశించారు. నీటిని వృథా చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, నీటి కొరతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఎల్‌నినో ప్రభావం వల్ల వ్యవసాయ రంగానికి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ అధికారులు రైతులకు ముందస్తు సూచనలు చేయాలని కలెక్టర్ తెలిపారు. యాసంగిలో వరి సాగు చేయకుండా, తక్కువ నీటితో పండే వేరుశనగ, జొన్నలు, మినుములు, కందులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 90 రోజుల్లో పండే పంటలపై రైతులకు వివరించాలని, పండించిన పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పల్లె దవాఖానాల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను తక్షణమే గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా నీటి కొరత ఉంటే భూగర్భ జల వనరులు, మిషన్ భగీరథ ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పిల్లలు, విద్యార్థులు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామాల్లో పశువులు, అటవి జంతువులకు తాగునీటి కొరత ఏర్పడకుండా నీటి లభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నీరు అందక జంతువులు మృత్యువాత పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇళ్లపై సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పథకాలపై వివరించాలని, సోలార్ పంపుసెట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని అన్నారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలోనూ సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి టి. శేఖర్ రెడ్డి ,జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

కాగా ఈ సోమవారం రెవిన్యూ శాఖకు(21) ఫిర్యాదులు, ఇతర శాఖలకు(28) ఫిర్యాదులు మొత్తం(49) ఫిర్యాదులు వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.