Take a fresh look at your lifestyle.

ఎల్‌నినో పరిస్థితులపై సీఎస్ క్షేత్రస్థాయి సమీక్ష….

0 37

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

  • సాగుకు విద్యుత్ స‌ర‌ఫ‌రాపై దృష్టి
  • ఎల్‌నినో పరిస్థితులపై
    సీఎస్ క్షేత్రస్థాయి సమీక్ష

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, నీటి లభ్యతపై వాటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. జ‌లాశ‌యాల‌తోపాటుగా… పంట‌ల‌నూ స్వ‌యంగా ప‌రిశీలించారు. గురువారం నాడు సంగారెడ్డి జిల్లా సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి లభ్యతను పరిశీలిస్తూ, హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుపై సంబంధిత ఉన్నతాధికారులతో ఆయ‌న‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అధికారులకు సూచించారు. భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న పరిస్థితుల్లో నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, రానున్న 15 రోజులకు నీటి లభ్యతను అంచనా వేసుకుని తగిన నిర్వహణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు సుమారు 2–3 డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయని, ఈ కాలానికి ఇది అసాధారణ పరిస్థితి అని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఈ వాతావరణ మార్పులు పంటలపై చూపే ప్రభావాన్ని సంబంధిత శాఖలు నిశితంగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా రానున్న 15–20 రోజులు పొలాల్లో ఉన్న పంటలకు అత్యంత కీలకమైనందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు.

వ్యవసాయ అవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను స్వయంగా అంచనా వేయడంతో పాటు, రైతులు, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకోవాలని, ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.