ఎల్ నినో ప్రభావం వల్ల జిల్లాలో తాగునీరు,వ్యవసాయం,విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా సూక్స్మ స్థాయి ప్రణాళికలు రూపొందించాలి
మెట్రో న్యూస్
ఎల్ నినో ప్రభావం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలు తాగునీరు,వ్యవసాయం,విద్యుత్ తదితర అంశాలలో ఇబ్బందులు ఏర్పడకుండా సూక్స్మ స్థాయి ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖల కార్యదర్శి , మరియు ఎల్నినో పరిస్థితులపై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన దాసరి హరిచందన అన్నారు. ఎల్ నినో దృష్ట్యా తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా రానున్న నాలుగైదు నెలలకు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చేలా సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లను ఆమె కలెక్టర్లను ఆదేశించారు.
శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్ లో ఎల్ నినో ప్రభావం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ప్రస్తుతం వ్యవసాయ పంటల పరిస్థితి, సాగునీరు, తాగునీరు, విద్యుత్, భూగర్భ జలాలపై మూడు జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
డిసెంబర్ చివరి నాటికి ఎల్ నినో ప్రభావం తారస్థాయికి చేరే అవకాశం ఉందని, ఇప్పటికే జిల్లాలలో సగం ప్రాంతాలలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని , దీనివల్ల వ్యవసాయం, భూగర్భ జలాలు ,తాగునీరు, విద్యుత్తు,తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడనున్నదని తెలిపారు.
ఎల్ నినో పరిస్థితులలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ, మున్సిపల్ పట్టణాలలో ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించి నీటిని పొదుపుగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని , ఇందులో భాగంగా ప్రస్తుతం ఆయా జిల్లాలలో రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీరు, రిజర్వాయర్ల ద్వారా చివరి గ్రామం వరకు, చివరి ఇంటి వరకు తాగునీటిని ఎలా అందించాలో జిల్లా కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించాలని , అలాగే ప్రస్తుతం ఉన్న భూగర్భ జలాలతో పాటు, తర్వాత అందుబాటులో ఉండే భూగర్భ జలాలు, ప్రస్తుతం ఉన్న బోర్ల నుండి నీటిని ఎలా నిలువ ఉంచుకోవాలి ,గ్రామాల్లో నీటిని నిలువ ఉంచుకునేందుకు ఎన్ని వనరులు అందుబాటులో ఉన్నాయో, ఎన్ని వాటర్ ట్యాంకులు పని చేస్తూన్నాయో గ్రామాల వారీగా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. రబీలో రైతులు వరి వేయకుండా తక్కువ నీటి వనరులతో పండించే పంటలు వేసేలా అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని కలెక్టర్లతో కోరారు.ఎల్ నినోలో పశువుల పశుగ్రాసానికి, తాగునీటికి ఇబ్బంది పడకుండా ప్రతి గ్రామం వారిగా పశుగ్రాసంతో పాటు, నీటి వనరులను ముందే గుర్తించాలని చెప్పారు.
విద్యుత్ అధిక వినియోగం చేసే ప్రాంతాలు, ట్రిప్ నష్టాలు అన్నిటిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ను ఆదా చేయడంపై ప్రణాళిక రూపొందించాలని, సోలార్ విద్యుత్తును వినియోగించుకునేలా, సోలార్ బ్యాటరీ, సోలార్ మోటార్ల వినియోగం ,సూర్యగృహ వంటి సోలార్ విద్యుత్ పథకాల వినియోగం పై రైతులు, ప్రజలకు తెలియజేయాలని, గ్రామాలలో స్థానిక సర్పంచుల ద్వారా రైతులకు విస్తృతంగా తెలియజేసి ప్రోత్సహించాలని సూచించారు.
రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు లేనప్పటికీ ప్రజలకు నీటిని అందించేలా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా భూగర్భ జలాలను పెంపొందించేలా వి బి జి రాంజీ కింద పెద్ద ఎత్తున నీటి సంరక్షణ పనులను చేపట్టాలని, అలాగే మున్సిపాలిటీలలో వృధా నీటిని వినియోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి గ్రామంలో మ్యాజిక్ సోక్ పిట్లు, కమ్యూనిటీ సోక్ ఫిట్లు ,నీటి నిల్వ కట్టడాలు చేపట్టాలని , ప్రతి గ్రామంలో నీటి భద్రతకు వనరులను సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
వి బి జి రాంజీ కింద కూలీలు పని చేసే చోట తగినంత తాగునీరు,ఓ ఆర్ఎస్ పాకెట్లు, ప్రథమ చికిత్స సౌకర్యాలు, నీడ వంటివి ఏర్పాటు చేయాలని అన్నారు. ఎల్ నినో ప్రభావం వలన ప్రజలు ఆనారోగ్యం బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.