( మెట్రో న్యూస్ )
ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రస్తుతం గ్రంథాలయం నిర్మిస్తున్న స్థలం అనువైనది కాదని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గ్రంథాలయం నిర్మిస్తే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అది మేకల సంత స్థలమని ఇక్కడ గ్రంథాలయం నిర్మిస్తే మేకల సంత ఎక్కడ జరుపుకోవాలని ప్రశ్నించారు. ఎంపిక చేసిన స్థలం పక్కనే ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్, కల్లు కాంపౌండ్ ఉండటంతో దుర్వాసనతో పాటు విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందని అన్నారు. అంతే కాకుండా ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, కాబట్టి గ్రంథాలయానికి అది సరైన స్థలం కాదని వారు ఆరోపించారు. ఈ విషయంపై తహసిల్దార్ కు, గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. నందిపేట్ గ్రామ నడిబొడ్డులో ఉన్న వ్యాన్ అడ్డాలో గ్రంథాలయాన్ని నిర్మిస్తే విద్యార్థులతో పాటు అందరికీ అందుబాటులో ఉంటుందని గ్రామస్తులు సూచించారు. అధికారులు తమ వినతిని పరిగణలోకి తీసుకొని స్థలాన్ని మార్చాలని డిమాండ్ చేశారు.