Take a fresh look at your lifestyle.

గాల్లో ఉండగా హైజాక్ హెచ్చరిక.. జైపూర్‌లో అత్యవసరంగా దిగిన ఫ్రాంక్‌ఫర్ట్-ఢిల్లీ విమానం

0 12
  • ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం జైపూర్‌కు మళ్లింపు
  • హైజాక్ హెచ్చరిక రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్
  • విమానంలోకి ప్రవేశించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన భద్రతా ఏజెన్సీలు
  • ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని తెలిపిన అధికారులు

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో హైజాక్ కలకలం రేగింది. హైజాక్ హెచ్చరిక అందిన నేపథ్యంలో విమానాన్ని బుధవారం ఉదయం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. AI-2030 విమానం జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అవ్వగానే భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి.

ఢిల్లీకి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్ విమానాశ్రయంలో ఉదయం 9:45 గంటలకు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. వెంటనే వివిధ భద్రతా ఏజెన్సీల సిబ్బంది విమానాన్ని చుట్టుముట్టారు. హైజాక్ వంటి తీవ్రవాద ఘటనలు జరిగినప్పుడు అనుసరించే అత్యున్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్‌ను అధికారులు అమలు చేశారు.

విమానం ల్యాండ్ అయిన తర్వాత భద్రతా సిబ్బంది చాలా జాగ్రత్తగా దాన్ని సమీపించి, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం ప్రయాణికులను కిందకు దించేందుకు నిచ్చెనలు ఏర్పాటు చేశారు. విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణికులు, సిబ్బందిని బయటకు అనుమతించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని వారు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.