హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- మనవాళ్ళు గ్లోబల్ గా ఎదగాలి
- సమాఖ్య బిజినెస్ సమ్మిట్‌లో
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఒకసారి మనం ప్రపంచాన్ని గమనిస్తే… మహిళల భాగస్వామ్యం ఉన్న దేశాలే ఆర్థికంగా బలపడ్డాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతూరా ఉందన్నారు. తెలంగాణలో మహిళలకు తమ ప్రభుత్వం రూ. 61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆర్టీసీ బస్సులకు, పెట్రోల్ బంకులకు, సోలార్ ప్లాంట్స్ కు మహిళలను యజమానులను చేశామన్నారు. యువతతో పాటు మహిళలను ప్రోత్సహించండి… ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారం అందిస్తాం అని సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సూచన చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ హైటెక్స్‌లో సమాఖ్య బిజినెస్ సమ్మిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామరాజు, ఎంపీలు డాక్టర్ కె. లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మంచి విధానాలను మా ప్రభుత్వం కొనసాగిస్తుంది. మీ పెట్టుబడులకు మా భరోసా ఉంటుంది. తెలంగాణ రైజింగ్ లక్ష్యంగా ముందుకు వెళదాం అని పిలుపునిచ్చారు.
సమాఖ్య అనే పదానికి చాలా బలం ఉంది… ఆధునిక కాలంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడానికి, అంది పుచ్చుకోవడానికి సమాఖ్యలు ఉపయోగపడుతాయి. ప్రధాని మోదీ 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారు
ఇందుకు రాష్ట్రాల సహకారం అవసరం. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధి విషయంలో కాదు.. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం అని వెల్లడించారు.
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పం. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంది. దీన్ని 10 శాతానికి చేర్చాలనే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం. నూతన పారిశ్రామిక విధానంలో మీరంతా భాగస్వాములు కావాలి. ఇప్పటి వరకు మనవాళ్లు కేవలం కార్పొరేట్ కంపెనీలకు సర్వీస్ చేసే వైపు మాత్రమే ఉన్నారు. మన ప్రాంతానికి చెందిన వాళ్లు పెట్టుబడులు పెట్టి గ్లోబల్‌గా ఎదగాలని సీఎం తెలిపారు.