హైదరాబాద్ (మెట్రో న్యూస్):
సంప్రదాయబద్ధంగా హుస్సేన్ సాగర్ వేదికగా జరిగే గణేష్ నిమజ్జనాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అనుమతినిచ్చి, సకల సౌకర్యాలు కల్పించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా ట్యాంక్‌బండ్‌ను ‘వినాయక సాగర్’గా భావించి భక్తులు నిమజ్జనోత్సవాలు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించిన ఆయన తాను చదివిన కాలేజీ హాస్టల్, ‘ఈ’ హాస్టల్, ఓల్డ్ పీజీ హాస్టళ్లను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, ఖైరతాబాద్‌లోని 70 అడుగుల మహాగణపతి, కొత్తపేటలోని 73 అడుగుల విగ్రహాలతో పాటు నగరవ్యాప్తంగా లక్షకు పైగా విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి తరలివస్తాయని తెలిపారు. భారీ క్రేన్లు, నిరంతర పారిశుధ్య పనుల ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేసిన వెంటనే వ్యర్థాలను తొలగించి పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా నిర్వహించే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేస్తున్న న్యాయమైన డిమాండ్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని రాంచందర్ రావు తెలిపారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని సూచించారు.