ఢిల్లీ (మెట్రో న్యూస్):
- సీఎం రేవంత్ సహా హాజరైన
మంత్రులు, ప్రజాప్రతినిధులు - ఓట్ బచావో-దేశ్ బచావో
నినాదాలతో హోరెత్తిన హస్తిన
దేశ రాజధాని ఢిల్లీ పురవీధుల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కదంతొక్కారు. ఓట్ బచావో-దేశ్ బచావో నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు సోమవారం సుప్రీంకోర్టు మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటు హక్కును హరించే కుట్రలను సహించేది లేదు.. ఓటు చోరీపై దేశవ్యాప్త పోరాటం కొనసాగిస్తాం అంటూ నినదించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని… ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ తర్వాత ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, దేశ ప్రజాస్వామ్యం కోసం చేస్తున్న పోరాటం అని చాటిచెప్పారు.


ఒకవైపు ఏఐసీసీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరోవైపు ఇండీ కూటమి నేతలతో కలిసి మార్చ్ ఫర్ డెమొక్రసీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆనాడు ‘సైమన్ గో బ్యాక్’ నినాదం స్వాతంత్య్ర పోరాటానికి కొత్త ఊపునిచ్చిందని… ఇప్పుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో సాగుతున్న ‘జ్ఞానేశ్ గో బ్యాక్’ ఉద్యమం దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు, ఓటు హక్కును కాపాడేందుకు దోహదపడుతుందన్నారు. గాంధీ కుటుంబం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిందని, ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన రాహుల్‌గాంధీ ‘ఓట్ చోరీ’ ప్రచారం ద్వారా ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు.