పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవబట్టిస్తున్నారు కాంగ్రెస్‌పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఫైర్
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో ఒక ఫాల్స్ నెరేటివ్‌ను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తీవ్రంగా విమర్శించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వీళ్లు సాగిస్తున్న దుష్ప్రచారానికి హద్దు, అదుపు లేకుండా పోయిందన్నారు. అబద్ధాలు ఆడినా కనీసం అతికేటట్లు ఉండాలి కానీ, కాంగ్రెస్ నాయకులు ఆ విచక్షణను కూడా కోల్పోయారన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసిన తర్వాత, బయటకు వచ్చిన రాహుల్ గాంధీ మీడియా ముందు ఇంకో కొత్త నాటకానికి తెరలేపారని, తాము చెప్పిన ఆరోపణలకు రాష్ట్రపతి ఆధారాలు అడిగారని స్వయంగా రాహుల్ గాంధీయే చెప్పారని తెలిపారు. తీరా చూస్తే వాళ్ల దగ్గర సమర్పించడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. చేతిలో ఒక్క ఆధారం కూడా లేకపోయినా, చివరకు దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి ఓటు చోరీని ఒప్పుకున్నారంటూ సిగ్గులేకుండా ప్రచారం మొదలుపెట్టారు. ఆధారాలు చూపించలేని వీళ్లు, అబద్ధాలను అంటగట్టడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారం లేనప్పుడు అసలు ‘ఓట్ చోరీ’ ఎక్కడ జరిగినట్లు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.