ఢిల్లీ (మెట్రో న్యూస్):
- సీజేపీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత
- భద్రతా బలగాల ఆధీనంలో దేశరాజధాని
నాటకీయ పరిస్థితుల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలోనే ఆయన్ను నిర్బంధించారు. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవ్వగానే.. పోలీసుల బృందం ఫ్లైకి లోకి చొరబడి… దీప్కే సహా మరికొందరిని విమానం నుంచి బలవంతంగా కిందకు దింపి… వెనుక గేటు ద్వారా రహస్య ప్రదేశానికి తరలించారు. పోలీసుల తీరును దీప్కే ప్రశ్నించారు. విమానంలోనే భారత్ మాతాకు జై… ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలు మిన్నంటాయి. మీరెందుకొచ్చారంటూ మహిళా పోలీసులతో దీప్కే వారించడం కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో… సీజేపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఢిల్లీ విమానాశ్రయం దిశగా వెళ్లారు. దీంతో ఎయిర్ పోర్టు పరిసరాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
శనివారం నాడు జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన కార్యక్రమం నేపథ్యంలో… దేశ రాజధానిలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మెట్రో రైల్ స్టేషన్ల మూసివేత, ఇంటర్నెట్ సేవల నిలిపివేతను సీజేపీ ఖండించింది. వేలాది మంది పోలీసులను మొహరించారు. మూడు రోజులుగా కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు ఢిల్లీలో ఆందోళనకు దిగిన క్రమంలో… ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ సీజేపీ నిరసన కార్యక్రమంపై దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితులలోనూ నిరసనకారులు, జంతర్ మంతర్ వద్ద గుమికూడవద్దని భద్రతా బలగాలకు ఆదేశాలు వెళ్లాయి. ఒక రకంగా లాక్‌డౌన్ పరిస్థితులు కనిపించాయి. పోలీసులు ఎక్కడికక్కడ సీజేపీ మద్దతుదారులను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ సరిహద్దులలో ఎక్కడ చూసినా బ్యారికేడ్లు, పోలీస్ అవుట్‌పోస్టులే దర్శనమిచ్చాయి. జంతర్ మంతర్‌కు దారితీసే రహదారులన్నింటినీ పోలీసులు దిగ్భందం చేశారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తూ.. అనుమానం వస్తే అరెస్టు చేశారు.