Take a fresh look at your lifestyle.

వరద ముంపునకు శాశ్వత పరిష్కారం 57వ డివిజన్‌లో రూ.2.52 కోట్లతో రోడ్లు

0 21

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 57వ డివిజన్‌ సమ్మయ్యనగర్, గోకుల్‌నగర్ ప్రాంతాల్లో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.

మంగళవారం రూ.2.52 కోట్ల నిధులతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ జంక్షన్ వైపు నుంచి, సుబేదారి పోలీస్ స్టేషన్ వైపు నుంచి వచ్చే వర్షపు నీరు గోకుల్‌నగర్ చౌరస్తా వద్ద కలవడంతో ఏటా ముంపు సమస్య తలెత్తుతోందన్నారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

అదేవిధంగా అంబేద్కర్ జంక్షన్ నుంచి వడ్డేపల్లి చర్చి వరకు రోడ్డు విస్తరణకు రూ.18 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. రెండు రోజుల్లో టెండర్ ఓపెన్ చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

గోకుల్‌నగర్, వడ్డేపల్లి చౌరస్తాలను సుందరీకరించి ట్రాఫిక్ సమస్యలను తగ్గించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రోడ్లు, డ్రైనేజీ పనులకు దుకాణదారులు, ఇళ్ల యజమానులు ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. వ్యక్తిగత సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటికి పరిష్కారం చూపేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజల సహకారంతో 57వ డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి ఇ.వి. శ్రీనివాస్‌రావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, కాలనీ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.