హైదరాబాద్ (మెట్రో న్యూస్):
సాహితి ఇన్ఫ్రా మనీలాండరింగ్ కేసులో.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 27వ తేదీన హాజరు కావాలంటూ ఈడి ఆదేశించింది. ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతాల ద్వారా సాహితి ఇన్ఫ్రా నుంచి రూ.2.1 కోట్లు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఆ లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది. లావాదేవీల స్వభావం, ఉద్దేశంపై దర్యాప్తు జరగనుంది. నిధులకు సరైన వ్యాపార కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరిగే అవకాశం ఉంది.
సాహితి ఇన్ఫ్రా ఫ్లాట్లు, విల్లాలు నిర్మిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేదంటూ కొనుగోలుదారులు ఫిర్యాదులు చేయడం తెలిసిందే. తెలంగాణ పోలీసులు ఇదివరకే నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు సాగనుంది. సాహితి ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో తొలుత రూ.248 కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలున్నాయి. తదుపరి దర్యాప్తులో మోసం విలువ సుమారు రూ.842 కోట్లుగా ఈడీ అంచనా చేసినట్టు తెలుస్తోంది. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీగా నిధుల సేకరించారు. నిధులను సొంత, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావుపై అభియోగాలు మోపారు. దాదాపు రూ.126 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. బినామి లావాదేవీలను గుర్తించిన ఈడీ… సాహితీ సంస్థ ఎండీని రెండేళ్ళ కిందటే అరెస్టు చేసింది. రెండు విడతలుగా ఆస్తులను కూడా జప్తు చేసింది.