Take a fresh look at your lifestyle.

సాగునీరు అడిగితే అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేటీఆర్ ఆగ్ర‌హం

0 20

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

జూరాల ఆయకట్టుకు సాగునీరిచ్చి పంటలు కాపాడాలని డిమాండ్ చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలను, రైతులను అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ అక్రమంగా నిర్బంధించడం రేవంత్ రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. అదేవిధంగా వందలాది రైతులను కూడా పోలీసులు అడ్డుకుని, నిర్భంధించడం రాష్ట్రంలో సాగుతున్న అణచివేతకు తాజా ఉదాహరణ అన్నారు. కళ్లముందే పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతల గోసను ప్రభుత్వం తీర్చాల్సిందిపోయి, న్యాయమైన డిమాండ్ తో నిరసనకు సిద్ధమైన రైతులను, బీఆర్ఎస్ శ్రేణులను అణచివేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తోందని ఎక్స్ వేదిక‌గా కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా కూడా విడుదల చేయకుండా కుంటిసాకులతో రేవంత్ సర్కారు పచ్చని పంటల ఉసురు తీస్తోంది. తమ పంటలను కాపాడుకునే ఏకైక తపనతో గుండెపగిలిన రైతులు జూరాల గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తే, వారిపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం అన్నదాతలను అన్నివిధాలా అరిగోస పెడుతోంది. తెలంగాణ గడ్డపై ఉన్న జూరాల ప్రాజెక్టు పరిసరాల్లోకి రైతులు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి, వందలాది పోలీసులను చుట్టుపక్కల మోహరించడం, వస్తున్న రైతులను అడ్డగించి అరెస్టులు చేయడం ముమ్మాటికీ సిగ్గుమాలిన చర్య. అక్రమంగా అరెస్టుచేసిన రైతులను, బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం విడుదల చేయడంతోపాటు జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు రిలీజ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.