Take a fresh look at your lifestyle.

ప్రపంచ స్థాయిలో మెరిసిన అంబానీ స్కూల్.. టాప్ 10లో చోటు.. ఇండియా నుంచి ఒకే ఒక్కటి!

0 9
  • ప్రపంచంలోని టాప్ 10 ఐబీ స్కూళ్ల జాబితాలో ధీరూభాయ్ అంబానీ స్కూల్‌కు చోటు
  • ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ యూకే విడుదల చేసిన 2026 ర్యాంకింగ్స్‌లో 9వ స్థానం
  • సగటున 40.8 పాయింట్లు సాధించిన పాఠశాల విద్యార్థులు 
  • 13 మంది విద్యార్థులు 45కు 45 పాయింట్లు సాధించి రికార్డు  

భారత విద్యా రంగానికి గర్వకారణంగా నిలుస్తూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (డీఏఐఎస్) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) పాఠశాలల జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ యూకే విడుదల చేసిన 2026 గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ విద్యాసంస్థ ఇదే కావడం విశేషం.

ఈ ర్యాంకింగ్స్‌ కోసం నిర్వహించిన పరీక్షల్లో ధీరూభాయ్ అంబానీ స్కూల్ విద్యార్థులు సగటున 40.8 పాయింట్ల స్కోర్‌ను సాధించారు. పాఠశాల చరిత్రలోనే ఇది అత్యుత్తమ ప్రదర్శనగా యాజమాన్యం పేర్కొంది. ఈ ఏడాది 105 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, టాప్ 10 స్కూళ్లలో ఇదే అతిపెద్ద బ్యాచ్ కావడం గమనార్హం. అంతేకాకుండా, 13 మంది విద్యార్థులు గరిష్ఠంగా 45 పాయింట్లకు 45 పాయింట్లు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. 2026 సెషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఐబీ విద్యార్థుల సగటు స్కోరు కేవలం 30.88 పాయింట్లు మాత్రమే.

ఈ జాబితాలో హాంకాంగ్‌కు చెందిన సెయింట్ పాల్స్ కో-ఎడ్యుకేషనల్ కాలేజ్ 43.0 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, జపాన్‌లోని కె. ఇంటర్నేషనల్ స్కూల్ టోక్యో (42.7), యూకేలోని కింగ్స్ కాలేజ్ స్కూల్ వింబుల్డన్ (42.5) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఈ విజయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా పాఠశాల యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. “అకడమిక్ ప్రమాణాలు, మేధోపరమైన ఆసక్తి, ఆవిష్కరణలు, సంపూర్ణ విద్య పట్ల మా నిబద్ధతకు ఈ ర్యాంకింగ్ నిదర్శనం” అని పేర్కొంది. ఈ సందర్భంగా 2026 బ్యాచ్ విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అభినందించింది.

Leave A Reply

Your email address will not be published.