Take a fresh look at your lifestyle.

Nepal Floods | ఈ టీచర్.. రియల్ హీరో.. వరద ముంచెత్తిన వేళ 1600 మంది విద్యార్థులను కాపాడిన రాజేంద్ర

0 16

Nepal Floods | ఎంతో అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరించి వందలాది మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన ఒక ప్రధాన ఉపాధ్యాయుడిని నేపాల్‌ పౌరులు రియల్‌ హీరోగా ప్రశంసిస్తున్నారు.

Nepal Floods | ఈ టీచర్.. రియల్ హీరో.. వరద ముంచెత్తిన వేళ 1600 మంది విద్యార్థులను కాపాడిన రాజేంద్ర

Nepal Floods | కాఠ్మాండూ, ఆగస్టు 30: ఎంతో అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరించి వందలాది మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన ఒక ప్రధాన ఉపాధ్యాయుడిని నేపాల్‌ పౌరులు రియల్‌ హీరోగా ప్రశంసిస్తున్నారు. 47 ఏండ్ల రాజేంద్ర ద్వివేది త్రిశూల్‌లో ఉన్న త్రిభువన్‌ త్రిశూలి మాధ్యమిక పాఠశాలకు ప్రిన్సిపాల్‌. వరద ముప్పు ముంచుకు వస్తున్నదంటూ బుధవారం ఉదయం 9.20 గంటలకు తన స్నేహితుడు పంపిన సమాచారంతో ఆయన అప్రమత్తమయ్యారు. నదికి 60 మీటర్ల ఎగువన స్కూల్‌ ఉన్నందున 1,643 విద్యార్థులను మూడంతస్తులు పాఠశాల భవనం పైకి తీసుకుపోవాలని తొలుత భావించాడు. అయితే అది అంత సురక్షితం కాదన్న నిర్ణయానికి వచ్చాడు. విద్యార్థులందరినీ తరగతి గదుల్లోంచి బయటకు తీసుకురావాలని పాఠశాల ఉపాధ్యాయులందరినీ ఆదేశించాడు.

అత్యవసరంగా స్కూల్‌ బస్‌ డ్రైవర్లందరినీ రప్పించి విద్యార్థులను వాటిపై తరలిద్దామని ప్రయత్నించాడు. అయితే అప్పటికే వరద సమీపంలోకి వస్తుండటంతో అది కూడా క్షేమం కాదని భావించి పిల్లలను తీసుకుని పాఠశాలకు సమీపంలో ఎత్తయిన ప్రాంతానికి తీసుకుని పోయి ఒక బోధి వృక్షం కింద వారిని ఉంచాడు. ఇంతలో ఉప్పెనలా దూసుకువచ్చిన వరద ధాటికి మూడంతస్తుల పాఠశాల భవనం కొట్టుకుపోవడం చూసి విద్యార్థులు హాహాకారాలు చేశారు. తాము పాఠశాల భవనంలో ఉండి ఉంటే ఏం జరిగేదో ఊహించుకుని భయంతో వణికారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలను కాపాడిన ఆ ఉపాధ్యాయుడిని పౌరులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు.

ఐదుగురు స్నేహితుల్ని కాపాడిన ‘టీ బ్రేక్‌’

న్యూఢిల్లీ, ఆగస్టు 30: కొన్నిసార్లు మనం తీసుకునే చిన్న నిర్ణయమే..జీవిత గమనాన్ని మార్చేస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు ‘టీ బ్రేక్‌’ కోసం ఒక చోట ఆగటం, నేపాల్‌ వరదల్లో చిక్కుకోకుండా ప్రాణాలతో బయటపడేసింది. వారి ప్రయాణంలో ఈ చిన్న విరామం భయంకరమైన విపత్తులో చిక్కుకోకుండా చేసింది. నేపాల్‌లో పర్యటిస్తున్న ఐదుగురు స్నేహితులు ఆగస్టు 26న మలేఖు వద్ద టీ తాగడానికి ఓ హోటల్‌ వద్ద ఆగారు. అదే సమయంలో త్రిశూలి నది ఉప్పొంగి ప్రవహించటంతో వారు వెళ్లాల్సిన మార్గంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. ఒకవేళ వారు 10-15 నిమిషాల ముందే అక్కడి నుంచి బయలుదేరి ఉంటే వరదల్లో చిక్కుకొని ఉండేవారు. వరద ఉధృతి తగ్గకపోవడంతో ఆ ఐదుగురు ఎత్తయిన ప్రదేశంలో కారులోనే రెండు రాత్రులు భయంతో గడిపారు. స్థానిక పోలీసులు, అధికారుల సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ఆగస్టు 28న నేపాల్‌ను వీడి శనివారం నాటికి క్షేమంగా తమ ఇండ్లకు చేరుకున్నారు.

21 మంది ప్రాణాలను కాపాడిన చీర

చెన్నై: కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికులు నేపాల్‌లోని తిమురే వద్ద సంభవించిన భీకర వరదలు, కొండచరియల బీభత్సం నుంచి ప్రాణాలతో బయటపడి స్వస్థలానికి చేరుకున్నారు. శ్యాబ్రు బేస్‌, కేరుంగ్‌ మధ్య ఉన్న పర్వత మార్గంలో అకస్మాత్తుగా వచ్చిన వరద కారణంగా వీరి వాహనం మూడు వైపులా వరద నీటి మధ్య చిక్కుకుపోయింది. ఆ సమయంలో కేవలం డ్రైవర్‌ వైపు ఉన్న తలుపు ద్వారా మాత్రమే బయటపడే అవకాశం ఉంది. విపత్కర పరిస్థితిలో రత్న కుమార్‌ దంపతులు చూపిన సమయస్ఫూర్తి పలువురి ప్రాణాలను కాపాడింది. బురదవాలును ఎక్కలేక కింద చిక్కుకుపోయిన మహిళలను రక్షించేందుకు రత్నకుమార్‌ తిరిగి ప్రమాద ప్రాంతంలోకి దిగారు. చీరను తాడుగా మార్చి కిందనున్న మహిళలను ఒక్కొక్కరిగా పైకి ఎక్కించారు. పైనున్న అతని భార్య సహకారంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. రెండు రోజుల పాటు స్థానికులు ఇచ్చిన ఆహారంతో కాలం గడిపిన వీరు చెన్నైకి చేరుకున్నారు.

788కు చేరిన నేపాల్‌ మృతులు

  • కొనసాగుతున్న గాలింపు చర్యలు

కాఠ్మాండూ, ఆగస్టు 30: హిమాలయ దేశం నేపాల్‌లో బుధవారం సంభవించిన జలప్రళయంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఆదివారం ఆ దేశ అధికారులు అందించిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య 788కు చేరింది. అలాగే గల్లంతైన వారు 2,500కు పైగా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 8,730 మందిని రక్షించారు. గల్లంతైన వారిలో మూడు జిల్లాలకు చెందిన 238 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఐదవ రోజు కూడా సహాయక బృందాలు మృతదేహాల వెలికితీతను కొనసాగించాయి. పెద్దయెత్తున పేరుకుపోయిన బురద, శిథిలాలను తొలగిస్తూ గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. చిట్వాన్‌ జిల్లాలో 264, తూర్పు నవాల్‌పరాసిలో 194, పశ్చిమ నవాల్‌పరాసిలో 100, గోర్ఖాలో 58, దాడింగ్‌లో 50, నువాకోట్‌లో 52, తనాహులో 37, రసువాలో 13 మృతదేహాలు వెలికితీసినట్టు అధికారులు వివరించారు.

మూడు రోజులు బురద కింద సజీవంగా..

  • ఆరేండ్ల చిన్నారిని రక్షించిన సిబ్బంది

Nepal Rescued Girl

Nepal Rescued Girl

కాఠ్మాండూ: నేపాల్‌ వరదల్లో రసువా జిల్లాలో మూడు రోజుల పాటు శిథిలాలు, బురద కింద చిక్కుకొన్న ఆరేండ్ల చిన్నారిని ఈ నెల 28న రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు విపత్తు సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న తరుణంలో, ఈ నాటకీయమైన రక్షణ చర్య ఒక అరుదైన ఆశను రేకెత్తించింది. తిమురె గ్రామంలో వరద బాధితుల కోసం సాయుధ పోలీస్‌ బలగం గాలిస్తుండగా దట్టమైన బురద కింద ఏడుపు వినిపించింది.

దీంతో వారు అక్కడ తవ్వి మనీషా మగర్‌ అనే బాలికను రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అత్యవసర వైద్యం కోసం ఆమెను ఈ నెల 29న హెలికాప్టర్‌ ద్వారా కాఠ్మాండూకు తరలించారు. బాలిక గురించి లేదా ఆమె కుటుంబం గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే సంబంధిత అధికారులను వెంటనే సంప్రదించాలని ఒక నెటిజన్‌ కోరారు. ఆశలన్నీ కోల్పోయిన వేళ ఆమెను గుర్తించారని మరో నెటిజన్‌ ప్రశంసించారు.

నిండిపోయిన శవాగారాలు

కాఠ్మాండూ, ఆగస్టు 30: నేపాల్‌ వరద విలయంలో కన్నుమూసిన వారిలో గుర్తు తెలియని వారి మృతదేహాలను భద్రపర్చడం అధికారులకు సమస్యగా మారింది. ఇప్పటికే శవాగారాలు, తాత్కాలిక కేంద్రాలు మృతదేహాలతో నిండిపోయాయి. అంతేకాకుండా మృతదేహాలు కుళ్లిపోవడం ప్రారంభించాయి. ఇది మరింత ప్రమాదానికి దారితీయవచ్చునని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. దీంతో అధికారులు ఆయా మృతదేహాల డీఎన్‌ఏలు, ఫొటోలు, వారి ఒంటిపైన ఉన్న ఆభరణాలు, పుట్టుమచ్చలు, ఇతర ముఖ్యమైన ఆధారాలు సేకరించి వాటిని దేవఘాట్‌, భరత్‌పూర్‌లలోఒక బహిరంగ స్థలాల్లో ఖననం చేస్తున్నారు. మృతుల బంధువులు వస్తే వాటి ఆధారంగా భవిష్యత్‌లో వారికి వాటిని అందజేస్తారు. 788 మృతదేహాలు లభించగా, వాటిలో కేవలం 20 మాత్రమే బంధువులు గుర్తించడంతో వెంటనే వారికి అప్పగించారు. వరదకు గురైన 8 జిల్లాల నుంచి వస్తున్న మృతదేహాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే వాటిని గుర్తించడం బంధువులకు కష్టంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.