(మెట్రో న్యూస్):
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె. విజయలక్ష్మి సూచించారు. ధరూర్ మండలంలోని ఎంపీయూపీఎస్ మన్నాపూర్ పాఠశాలను ఆమె సందర్శించి విద్యాబోధన, విద్యార్థుల అభ్యసన స్థాయిలు, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా 3వ తరగతి తెలుగు, 8వ తరగతి ఆంగ్ల బోధన తరగతులను స్వయంగా పరిశీలించి విద్యార్థుల ప్రతిభను తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి పాఠ్యాంశాలు అర్థమయ్యేలా ఆసక్తికరమైన బోధనా పద్ధతులు అవలంబించాలని, పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధన సాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. టీచింగ్ డైరీని ప్రతిరోజూ తప్పనిసరిగా రాయాలని ఆదేశించారు.
అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులకు ప్రతిరోజూ మూడు గుడ్లు తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేశారు. ఫుడ్ కమిటీని ఏర్పాటు చేసి భోజనం వడ్డించే ముందు ఆహార నాణ్యతను పరిశీలించాలని, ఫుడ్ టేస్టింగ్ రిజిస్టర్‌ను క్రమం తప్పకుండా నిర్వహించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు.