Take a fresh look at your lifestyle.

ఏఐ టెక్నాలజీతో జెండావందనం.. కరీంనగర్ బాల మేధావికి ఈటల అభినందనలు

0 11
Eatala Rajender congratulates Karimnagar child prodigy for AI flag hoisting technology
  • కరీంనగర్ జిల్లా బాలుడి అద్భుత ఆవిష్కరణ
  • ఏఐ, మొబైల్ ఆధారిత ఫ్లాగ్ హోస్టింగ్ సిస్టమ్ రూపకల్పన
  • 13 ఏళ్ల శ్రీ సృష్టి సాయిని ప్రశంసించిన ఎంపీ ఈటల రాజేందర్
  • ప్రధాని మోదీ వల్లే దేశంలో డిజిటల్ విప్లవం సాధ్యమైందన్న ఈటల
  • విద్యార్థులు ఏఐ, కోడింగ్ నైపుణ్యాలు నేర్చుకోవాలని పిలుపు
కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన 13 ఏళ్ల బాల మేధావి శ్రీ సృష్టి సాయి సాంకేతిక ప్రతిభపై మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో మొబైల్ ద్వారా నియంత్రించే వైఫై ఆధారిత ఫ్లాగ్ హోస్టింగ్ (జెండా వందనం) సిస్టమ్‌ను రూపొందించిన సృష్టి సాయిని ఆయన అభినందించారు. చిన్న వయసులోనే సాంకేతికతపై పట్టు సాధించి అద్భుత ఆవిష్కరణ చేసిన ఆ బాలుడు ఎందరికో ఆదర్శమని కొనియాడారు.
ఈ విషయంపై ఈటల రాజేందర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “శ్రీ సృష్టి సాయి ప్రదర్శించిన సాంకేతిక ప్రతిభ అభినందనీయం. ఈ పిన్న వయసులోనే అతని ఆవిష్కరణ గర్వకారణం” అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘డిజిటల్ ఇండియా’ దార్శనికతతో దేశం ముందుకు దూసుకెళ్తోందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్లే సృష్టి సాయి వంటి యువ ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారని అభిప్రాయపడ్డారు.మోదీ ప్రోత్సాహంతో భారత్ నేడు కేవలం టెక్నాలజీని వినియోగించే దేశంగా కాకుండా, కొత్త టెక్నాలజీలను సృష్టించే గ్లోబల్ హబ్‌గా మారుతోందని ఈటల అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి విద్యార్థులు సంప్రదాయ చదువులతో పాటు ఏఐ, కోడింగ్ వంటి ఆధునిక నైపుణ్యాలను అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ సృష్టి సాయి భవిష్యత్తులో మరిన్ని గొప్ప ఆవిష్కరణలు చేయాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు తన పోస్టులో ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.