హైదరాబాద్ (మెట్రో న్యూస్):
ప్రజల ఓటు హక్కుకు గండి కొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో అర్హులైన పౌరులను ప్రజాస్వామ్య ప్రక్రియకు దూరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఓటరు జాబితాలో ప్రతి పేరు వెనుక ఒక పౌరుడి రాజకీయ అస్తిత్వం, ఆత్మగౌరవం, దేశ భవిష్యత్తును నిర్ణయించాలన్న ఆకాంక్ష ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. హక్కుల పరిరక్షణ కోసమే లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బలమైన స్వరాన్ని వినిపిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆందోళనలను రాజకీయ చర్చలోకి తీసుకురావడంతో పాటు న్యాయపరమైన పరిష్కారాల కోసం ఆయన సాగిస్తున్న పోరాటం ప్రజాస్వామ్య బాధ్యతకు నిదర్శనమన్నారు.
“తప్పు వ్యవస్థలో జరిగితే దాని భారాన్ని పౌరుడి భుజాలపై మోపడం ఏమిటి? తన పేరు ఎందుకు తొలగిపోయిందో తెలుసుకోవడానికి ఓటరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఎందుకు రావాలి? హక్కును కాపాడాల్సిన వ్యవస్థే అడ్డంకిగా మారితే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి?” అని మంత్రి ప్రశ్నించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ—ఎస్‌ఐఆర్—అమలుపై తలెత్తిన ఆరోపణలకు స్పష్టమైన సమాధానాలు రావాలని డిమాండ్ చేశారు. తొలగించిన ప్రతి పేరుకు కారణం తెలియాలని, సంబంధిత పౌరుడికి సమాచారం అందాలని, తన వాదన వినిపించుకునేందుకు తగిన అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. పొరపాటుగా తొలగిపోయిన అర్హుల పేర్లను సత్వరం పునరుద్ధరించే సమర్థమైన వ్యవస్థ ఉండాలన్నారు.