హైదరాబాద్ (మెట్రో న్యూస్)
వారిద్దరిపై చర్యలు తీసుకోండి
క్షుద్ర పూజల ఆరోపణల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పరువు నష్టం దావా వేశారు. క్షమాపణ చెప్పాలని ఇప్పటికే లీగల్ నోటీసులు పంపడం తెల్సిందే. అయితే గడువులోపు వారిద్దరు క్షమాపణలు చెప్పకపోవడంతో హరీశ్ రావు తరుపు న్యాయవాది తాజాగా నాంపల్లి కోర్టులో డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. గురువారం నాడు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో హరీశ్ రావు తరఫున న్యాయవాదులు రెండు ప్రైవేట్ పిటీషన్లు దాఖలు చేయడం గమనార్హం.
ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద న్యాయవాదులు మాట్లాడుతూ.. హరీశ్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ నిరాధార ఆరోపణలు చేశారు. ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా హరీశ్ రావు ఇమేజ్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తాము భావిస్తున్నట్టు చెప్పారు. దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం ప్రతి హిందువుకు ఉన్న హక్కు. పవిత్రమైన దేవాలయాలకు వెళ్లి పూజలు చేసినంత మాత్రాన క్షుద్ర పూజలు చేశారని ఆరోపణలు చేయడం సరికాదని వారన్నారు. ఇది క్రిమినల్ కేసు. తప్పు రుజువు అయితే రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఆరోపణలకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించినట్టు పేర్కొన్నారు.