- సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ముసుగులు ధరించిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారన్న కేటీఆర్
- పీఎస్ బయట, లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని డిమాండ్
- రేవంత్ పాలనతో తెలంగాణ రౌడీ రాజ్యంలా మారిందని మండిపాటు
హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో తన పీఆర్‌ఓ మహేశ్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిపై దాడి చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారుల సమక్షంలోనే ముసుగులు ధరించిన 15 మంది గుండాలు లోపలికి చొరబడి పక్కా ప్రణాళికతో ఈ దాడికి పాల్పడ్డారని… రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి ఇది నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రౌడీ రాజ్యంలా మారిందని, అణచివేతకు తలొగ్గని ప్రతీ పౌరుడికీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ గేటు ఘటనకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నప్పటికీ, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విచారణ పేరుతో ఉదయాన్నే స్టేషన్‌కు పిలిపించి చీకటి పడే వరకు కాలయాపన చేసి ఈ కుట్రకు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ గుండాలు ఈ దాడికి పాల్పడ్డారా? లేక పోలీసులే మఫ్టీలో ముసుగులు వేసుకుని వచ్చారా? అనే దానిపై నిజాలు బయటకు రావాలంటే తక్షణమే సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
స్టేషన్ లోపల, బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీని వెంటనే భద్రపరచాలని, గాయపడిన తన సిబ్బందికి రక్షణ కల్పించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ‘ఎక్స్’ వేదికగా ట్యాగ్ చేస్తూ ‘వెల్‌డన్ కాంగ్రెస్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.