హైదరాబాద్ (మెట్రో న్యూస్):
అగా ఖాన్ ఫౌండేషన్ సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఈ ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే మా శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకున్నామని… కుతుబ్ షాహీ టూంబ్స్‌ను కూడా అదే పునరుద్ధరించిందని సీఎం గుర్తుచేశారు. సోమవారం నాడు తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-V తో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంత్రి అజాహరుద్దీన్, సీఎస్ సంజయ్ జాజు, ప్రత్యేక సలహాదారు కె.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రిన్స్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం… పరివాహక ప్రాంతంలో ఉన్న సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. మూసీ నదిని నైట్ ఎకానమీ కోసం తీర్చిదిద్దుతామని ప్రిన్స్ దృష్టికి తీసుకెళ్లారు.
డిసెంబరులో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. 100కు పైగా దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరవుతారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. నెట్-జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ ఉండబోతుందని వివరించారు. సింగపూర్‌కు చెందిన కంపెనీ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోందని.. ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ లాంటి సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు.