కరీంనగర్ (మెట్రో న్యూస్):
- కలక్టర్ భవనం పేదవాడికి నమ్మకం కల్పించాలి
- నిస్సహాయంగా వచ్చేవారికి న్యాయం జరగాలి
జిల్లా కలెక్టరేట్ భవనం పేదవాడికి ఒక నమ్మకం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పేదల సమస్యల చిక్కుముడులు విప్పడానికి ఈ కార్యాలయం ఉపయోగపడాలన్నారు. సహాయం కోసం నిస్సహాయంగా వచ్చే వారిలో మన కుటుంబ సభ్యులను చూడండి… అప్పుడే సహాయం కోసం వచ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని తెలిపారు. మీరంతా కష్టపడితేనే పేదలకు న్యాయం జరుగుతుందని అధికారులను ఉపదేశించారు. బుధవారం కరీంనగర్ నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం, భవన సముదాయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొత్త కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు సేవలు అందించే మీకు మౌలిక వసతులు కల్పించాలని ఈ భవన సముదాయ నిర్మాణం పూర్తి చేశాం. కేంద్రంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు వెళతాం. వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించినా కేంద్రం అనుమతులు ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదు. కానీ కొందరు మా పర్యటనలను లెక్కలేస్తున్నారు.. సమస్యలు పరిష్కరించుకునేందుకు ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలవాల్సిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు నెలల్లోనే 170 ఎకరాలు డిఫెన్స్ భూములను రాష్ట్ర అభివృద్ధి కోసం బదలాయించేలా చేశాం. బేగంపేట రన్ వే కింద నుంచి రోడ్డు వేసుకునేందుకు అనుమతులు సాధించాం. సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం ఒకరికొకరం సహకరించుకుంటాం అని సీఎం వెల్లడించారు.