నీట మునిగిన పంటలు
రైతులకు అపార నష్టం
మెట్రో న్యూస్, ఏన్కూర్, నవంబర్ 4: మురుసు తుఫాన్ ప్రభావంతో మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షం కురవడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది.మండలంలో రైతులు పత్తి, మిర్చి, వరి పంటలను వేల ఎకరాలు సాగు చేశారు. ప్రస్తుతం పత్తి చేతికొచ్చి తీతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పత్తి పంట క్వింటా 8 వేల రూపాయల పైచిలుకు అమ్ముతున్నారు. తుఫాన్ ప్రభావంతో పత్తి పంట మొత్తం కారి భూమి పాలై పోతుంది. దీంతోపాటు వరి పంట మొత్తం గాలి దుమారానికి కింద పడిపోయింది. మరొ 15 రోజుల్లో కోతలకు వచ్చిన వరి పంట మొత్తం నీటి పాలు అవడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. అదేవిధంగా మిర్చి తోటలు మొత్తం కాపు దశలో ఉన్నాయి. మంగళవారం రాత్రి వచ్చిన గాలి తుఫానుకు తోటలు మొత్తం కింద పడిపోయాయి. కొన్ని ప్రదేశాలలో పంటల మొత్తం వర్షపు నీటిలో మునిగిపోయాయి.చేతికొచ్చిన పంటలు చేజారి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క రైతుకు లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.