Take a fresh look at your lifestyle.

శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై ఐడీఓసీలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం

0 20

మెట్రో న్యూస్ 

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

వేములవాడ పట్టణంలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, 80ఫీట్ల రోడ్డు నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయం తదితర నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సోమవారం వివరించగా, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమీక్షించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులపై ఆరా తీశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని సూచించారు. ప్రస్తుత భక్తుల రద్దీ .. భవిష్యత్తులో రద్దీకి అనుగుణంగా ప్రణాళిక ప్రకారం అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రతి అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక్కో పనికి గడువు విధిస్తూ వాటిని పూర్తి చేయాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారని, నిధులు మంజూరు చేస్తున్నారని, పనుల ప్రక్రియపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని వెల్లడించారు ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న పుష్కరాలకు సంబంధించి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు

రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగం విస్తరించేలా ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం పనులు చేయిస్తుందని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క ఆలయానికి భక్తులు నిరంతరం వెళ్లేలా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందని స్పష్టం చేశారు. అధికారులు అన్ని పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని, 80 ఫీట్ల రోడ్డును పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు పూర్తి చేసే అవకాశం రావడం అదృష్టమని, దీనిలో అధికారులు పూర్తిస్థాయిలో భాగస్వాములై పూర్తి చేయాలని సూచించారు.
శ్రీ విధుశేఖర భారతి స్వామి, సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయ విస్తరణ పనులను చేయాలని ఆదేశించారు.

అధికారులందరూ ఈ పనులు తమవిగా భావించి పూర్తిస్థాయిలో నిమగ్నమై వేగంగా పూర్తి చేయించాలని సూచించారు. జిల్లాలోని కార్మిక, ధార్మిక ప్రాంతాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని వివరించారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రతి వారం క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. వాటిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తూ.. పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులకు సూచనలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి అధికారి తన బాధ్యతల కాలంలో ఆలయ నిర్మాణం పనుల్లో భాగస్వామ్యులు కావడం ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని పేర్కొన్నారు.

సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఈఈ భీమ్లానాయక్, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ రమాదేవి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఎం శ్రీనివాస్, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఈ రాజేష్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్, వీటీఏడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.