Take a fresh look at your lifestyle.

ప‌రేషాన్‌లో రాజ‌కీయ పార్టీలు

0 3

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

  • ఇప్ప‌ట‌కే స‌ర్‌పై పోటాపోటీ ఉద్య‌మాలు
  • ముంచుకొస్తున్న ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు

తెలంగాణ ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌కు ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌లు స‌వాలుగా మారాయి. స‌ర్ ప‌క్రియ‌ ఒక‌వైపు త‌ల‌నొప్పిగా మారితే… గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల న‌మోదు అంశం మ‌రో స‌మ‌స్య‌గా త‌యారైంది. గ‌తంతో సంబంధం లేకుండా ఎన్నిక‌లు జ‌రగ‌నున్న రెండు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల‌లో అర్హులైన వారంతా మ‌ళ్లీ కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న పెట్టింది. అయితే ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్ల న‌మోదు కార్య‌క్ర‌మం న‌త్త‌న‌డ‌క‌గా సాగుతోంది. రాజ‌కీయ పార్టీలు ఈ విష‌యంలో చొర‌వ తీసుకుంటున్నా… ఆశించిన స్థాయిలో న‌మోదు కార్య‌క్ర‌మం ముందుకు సాగ‌డం లేదు. డిగ్రీ స‌ర్టిఫికెట్ జిరాక్స్‌పై గెజిటెడ్ అధికారి అటెస్టు చేశాకే, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల‌ని ఎన్నికల అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. కానీ పార్టీల‌ నాయ‌కులేమో… అదేం అవ‌స‌రం లేదు… సంత‌కం అవ‌స‌రం లేకుండానే ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ఓట్ల న‌మోదు ప్ర‌క్రియ‌పై ఓట‌ర్ల‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది.

రాష్ట్రంలోని ప్రధాన రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టికే స‌ర్ ప్ర‌క్రియ‌పై పోరాడుతున్నాయి. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు… దీనిపై పూర్తిగా దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్… ఈ మొత్తం ప్ర‌క్రియ‌నే త‌ప్పుబ‌డుతోంది. కేంద్రం, సీఈసీ క‌లిసి ఓట్ల తొల‌గింపున‌కు కుట్ర ప‌న్నాయ‌ని ఆరోపిస్తున్నాయి. దీనిపైనే ఢిల్లీలో ఈనెల 1న ఇండియా కూట‌మి పార్టీల‌ భారీ ర్యాలీ జ‌రిగింది. రాష్ట్రం నుంచి ముఖ్య‌మంత్రి, మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ నాయ‌క‌త్వం అంతా ఢిల్లీ వెళ్లి వ‌చ్చింది. దీనికి కొన‌సాగింపుగా, మంత్రులు ఇప్ప‌టికీ… స‌ర్‌ను వ్య‌తిరేకిస్తున్నారు. స‌ర్‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు తెర‌పైకి వ‌చ్చాయి. ఖ‌మ్మం-న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఎన్నిక‌లున్నాయి. వాటి కోసం ఓటర్ల న‌మోదు కార్య‌క్ర‌మం ఇప్పటికే ప్రారంభ‌మైంది. నమోదు సరళి చూసి గ‌డువు పెంచాల‌ని పార్టీలు విజ్ఞ‌ప్తి చేశాయి. సాంకేతిక కారణాల‌తో న‌మోదుకు అడ్డంకులు క‌ల‌గ‌డంతో.. విధిలేక నామినేష‌న్ల దాఖ‌లు వ‌ర‌కు ఓట‌ర్ల న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని సీఈఓ‌ తాజాగా ప్ర‌క‌టించారు.

బీఆర్ఎస్‌… ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక‌టి ఓసీకి, రెండోది బీసీకి ఇవ్వాల‌ని దాదాపుగా నిర్ణ‌యించింది. మ‌రోవైపు బీజేపీ పోటీ ర్యాలీలు, పాద‌యాత్ర‌ల‌తో కాంగ్రెస్‌‌ దూకుడుకు చెక్ పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమ‌వారం నాడు పాద‌యాత్ర చేశారు. మ‌రునాడే నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ఆ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ, పాద‌యాత్ర జ‌రిగింది. న‌కిలీ ఓట్లు, చొర‌బాటుదారుల ఓట్లు తొల‌గించ‌వ‌ద్దా అని బీజేపీ నాయ‌కత్వం ప్ర‌శ్నిస్తోంది. ఇక ఎమ్మెల్సీ ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల విష‌యానికొస్తే… రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావుకు వ్య‌క్తిగ‌తంగా ప‌రీక్ష లాంటిదే! అభ్య‌ర్థుల విష‌యంలో ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేక‌పోతుంది. స్వ‌యంగా రాంచంద‌ర్‌రావునే బ‌రిలోకి దింపాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. జాతీయ నాయ‌క‌త్వం ఆదేశిస్తే పోటీ చేయ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి నెల‌కొంది… గెలిస్తే స‌రే… ఒక‌వేళ‌ ఓడితే… పార్టీకి కూడా అప్ర‌తిష్ట అనేదానిపై క‌మ‌ల‌ద‌ళంలో చ‌ర్చ జ‌రుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.