Take a fresh look at your lifestyle.

రూ.10 కోట్లతో సన్నూరు వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి

0 5

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి – ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

జిల్లా కలెక్టర్ సత్య శారదతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష

మెట్రో న్యూస్ 

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్ష సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారదకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు
సన్నూరు వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎస్‌డీఎఫ్ నిధుల కింద రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు చేపట్టారు.
ఈ సందర్భంగా ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన నిర్మాణాల వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో తీర్చిదిద్దాలని సూచించారు.
ప్రధాన అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు
కోనేరు నిర్మాణం (111.08 × 111.08 అడుగులు) – రూ.261.89 లక్షలు
అనివెట్టి మండపం నిర్మాణం – రూ.57.28 లక్షలు
శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయ నిర్మాణం – రూ.15.94 లక్షలు
1,344 అడుగుల ప్రాకార గోడ నిర్మాణం – రూ.242.24 లక్షలు
పోర్టికో మండపం నిర్మాణం – రూ.39.89 లక్షలు
శివాలయ నిర్మాణం – రూ.120 లక్షలు
ఆలయ సుందరీకరణ పనులు – రూ.60 లక్షలు
పెండింగ్ పనులపై ప్రత్యేక సమీక్ష
ఇప్పటివరకు అనివెట్టి మండపం, పోర్టికో మండపం, ప్రాకార గోడ, ఔటర్ ప్రాకార గోడ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇంకా అనివెట్టి మండపం, పోర్టికో మండపం సుందరీకరణ, ప్రాకార గోడ ప్రవేశ ద్వారాల నిర్మాణం, కోనేరు నిర్మాణం, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శివాలయ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది.
ఈ పనులన్నింటినీ ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ను కోరారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం
సన్నూరు శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచ్, ఆలయ ధర్మకర్తలు, ఆలయ అభివృద్ధి కమిటీ బాధ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.