Take a fresh look at your lifestyle.

సీపీఐకి రాజీనామా.. బీఆర్‌ఎస్‌లోకి ఉద్యమకారుడు బట్టు సాంబయ్య

0 4

మెట్రో ప్రతినిధి

తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారుడు, విద్యావేత్త, సామాజిక కార్యకర్త బట్టు సాంబయ్య సీపీఐ పార్టీ నల్లబెల్లి మండల కార్యదర్శి పదవికి రాజీనామా చేసి తిరిగి తన సొంత గూడు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.
నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన బట్టు సాంబయ్య తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. నాడు నల్లబెల్లి మండల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశారు. మండల కేంద్రంలో అమరణ నిరాహార దీక్ష చేపట్టి, లాఠీ దెబ్బలకు, పోలీసుల నిర్బంధాలకు భయపడకుండా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం సైతం అనుభవించారు.
2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఆయన, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు.
అనంతరం సీపీఐ పార్టీలో చేరి నల్లబెల్లి మండల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై సీపీఐ పార్టీ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు బట్టు సాంబయ్య తెలిపారు. రాష్ట్రంలో రైతుల పంటలు నీటి కొరతతో ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో సీపీఐ మద్దతుగా నిలవడం లేదని భావించి పార్టీకి రాజీనామా చేసినట్లు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో కలిసి పనిచేసిన బీఆర్‌ఎస్ పార్టీలో తిరిగి చేరడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ చేరిక కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్‌రావు, సీనియర్ నాయకులు పాలెపు రాజేశ్వరరావు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సాంబరావు తదితరులతో పాటు మండలంలోని 29 గ్రామపంచాయతీల నుంచి తరలివచ్చిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.