మెట్రో న్యూస్.
భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్సార్ డిజి హైస్కూల్లో షీ టీం, భరోసా సంయుక్తంగా విద్యార్థినీ, విద్యార్థులకు మహిళా భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్సై స్వప్న కుమారి షీ టీం విధులు, మహిళలు, బాలికలకు అందించే రక్షణ సేవలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టం, బాలల హక్కుల గురించి వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, ఓటిపి ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యార్థులు సైబర్ నేరాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలని, తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమాచారం అందించే విద్యార్థుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మహిళలు, బాలికలు వేధింపులకు గురైనప్పుడు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, అత్యవసర సమయాల్లో షీ టీం 8712658162, పోలీస్ అత్యవసర నంబర్ 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన సందేహాలను పోలీసులు నివృత్తి చేశారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ, తమ పరిసరాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల భద్రత, బాలల హక్కుల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, షీ టీం, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.