బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నాబ్’ తుపాను అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటనున్న నేపథ్యంలో, పొరుగు రాష్ట్రమైన ఒడిశా అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, భారత వాతావరణ శాఖ ఒడిశాలోని ఐదు దక్షిణ జిల్లాలకు రెడ్ వార్నింగ్ జారీ చేసింది. ముందుజాగ్రత్త చర్యగా ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది.

వివరాల ప్రకారం… గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (20 సెం.మీ కంటే ఎక్కువ) కురుస్తాయని… గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అక్టోబర్ 28, 29 తేదీల్లో ఈ ఐదు జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి… ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఏఎఫ్, అగ్నిమాపక బృందాలను సిద్ధంగా ఉంచారు. తుపాను ప్రభావిత జిల్లాల అధికారుల సెలవులను రద్దు చేసి, హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ తుపాను బాపట్ల, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే సమయంలో గంటకు 115-125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్ఠంగా 140 కిలోమీటర్లకు చేరవచ్చని ఐఎండీ అంచనా వేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.