హైదరాబాద్ (మెట్రో న్యూస్):
ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలలో ఎన్‌నినో సంక్షోభం పొంచి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మన దేశంలోనూ… అలాగే తెలంగాణలోనూ ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్నారు. భూమిపై ఉన్న ప్రతి జీవరాశిపై ఎల్‌నినో ప్రభావం ఉండబోతుందన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద విపత్తు ఎల్‌నినో… వచ్చే 8 నెలలు అప్రమత్తంగా ఉందాం అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం సచివాలయంలో అందుబాటులో ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులతో సీఎం ఎల్‌నినో ప్రభావంపై చర్చించారు. అనంతరం మంత్రులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.

తీవ్ర ఎండలు, తాగునీటి కొరత ఏర్పడబోతుందని శాస్త్రవేత్తలు 2026 సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటించారని గుర్తుచేశారు. మొత్తానికి ప్రకృతి విపత్తును ఎదుర్కోబోతున్నాం. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. సాగు, తాగునీటి కొరతతో పాటు విద్యుత్ కొరత కూడా ఏర్పడుతోంది. మార్చిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత అక్టోబర్‌లో ఉందన్నారు. 10 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయే పరిస్థితి ఉందని నివేదికలు వచ్చాయి. ఎల్‌నినోను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు అండగా నిలబడాలి. రైతులు పెద్ద మనసు చేసుకుని యాసంగిలో పంటలు వేయడం తగ్గించుకోవాలి. వచ్చే సీజన్‌లో వరి వేయడాన్ని వాయిదా వేసుకోవాలి. ఉపాధి హామీ ద్వారా రైతు కూలీలకు అండగా ఉంటాం అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో దసరా తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరిస్తాం. ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రిని, ఇతర మంత్రులను కలుస్తాం. నోడల్ అధికారిగా ప్రభుత్వం సలహాదారు కె.రామకృష్ణారావును నియమిస్తున్నాం. ప్రజలను చైతన్యపరచడానికి కళాజాతాలను ఏర్పాటు చేస్తాం. సీనియర్ జర్నలిస్టులు, నిపుణులు పత్రికల్లో వ్యాసాలు రాయాలి. సినీ నటులు, క్రీడాకారులు, కళాకారుల సహకారం తీసుకుని వారితో ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయించి అప్రమత్తం చేస్తాం. ఇది అందరి సమస్య.. అందరం కలిసి విజయవంతంగా ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.