Take a fresh look at your lifestyle.

మూడు దశల్లో భూ రీసర్వే….

0 17

హైదరాబాద్‌ (మెట్రో న్యూస్) :-

  • వచ్చే నెలాఖరుకు తొలి దశ పూర్తి
  • 285 గ్రామాల్లో సర్వే పూర్తి. మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారు

రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో సమగ్ర భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తొలి దశలో ఎంపిక చేసిన 2,720 గ్రామాలకు గాను ఇప్పటివరకు 285 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, ఆయా గ్రామాల్లో భూ యజమానుల అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వచ్చే నెలాఖరుకు తొలి దశ సర్వేను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో భూముల హద్దులను కచ్చితంగా నిర్ధారించి, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్‌ గుర్తింపు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

అనేక ప్రాంతాల్లో పాత సర్వే రికార్డుల ఆధారంగానే భూముల వివరాలు కొనసాగుతున్నాయని, భూముల విభజనలు, పట్టణీకరణతో హద్దుల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. వీటికి పరిష్కారంగా డీజీపీఎస్‌, రోవర్లు, జీఐఎస్‌, క్యూజీఐఎస్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేయగా, అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారైనట్లు తెలిపారు. రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూకమతానికి స్పష్టమైన సరిహద్దులు నిర్ణయించి, ప్రత్యేక భూదార్‌ నంబర్లు, కార్డులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. సర్వే వివరాలను డిజిటల్‌ రూపంలో భద్రపరిచి భూ భారతి పోర్టల్‌లో నమోదు చేయనున్నట్లు చెప్పారు. తన సొంత నియోజకవర్గమైన పాలేరు పరిధిలోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామంలో 665 ఎకరాలకు వందశాతం రీసర్వే పూర్తయిందని, త్వరలో అక్కడ భూదార్‌ పట్టాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

ఈ విధానంతో భూ యాజమాన్య హక్కులపై స్పష్టత రావడంతో పాటు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సమయంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేకు వెళ్లే ముందు భూ యజమానులకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని, ఒకటి రెండు రోజుల ముందు గ్రామాల్లో చాటింపు వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ భూములకు స్పష్టమైన మార్కింగ్‌ చేయడంతో పాటు గ్రామకంఠం హద్దులను నిర్ధారించిన తర్వాతే సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రజల అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని, ప్రక్రియలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. భూ రీసర్వేను ప్రజల జీవితాలతో ముడిపడిన కీలక బాధ్యతగా గుర్తించి, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.