Take a fresh look at your lifestyle.

కుటుంబాలతో కలసి బతుకమ్మ సంబరాలు….

0 15

(మెట్రో న్యూస్)

సింగరేణి మందమర్రి ఏరియాలోని సీఈఆర్‌ క్లబ్‌ ప్రాంగణంలో కుటుంబ దినోత్సవం, బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎన్. రాధాకృష్ణ, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు ఎన్. శ్రీవాణి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలు, స్థానిక ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని కుటుంబ దినోత్సవం, బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. విధి నిర్వహణలోని ఒత్తిడులను మరచి కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వాతావరణంలో గడపడం సంతోషకరమని పేర్కొన్నారు.

శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ధ్రువపత్రాలు

2025–26 సంవత్సరంలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ వృత్తి శిక్షణా కోర్సులను పూర్తి చేసిన మహిళలకు అతిథులు ధ్రువపత్రాలను అందజేసి అభినందించారు. మహిళలు, దంపతులకు ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, మహిళలు ప్రదర్శించిన బృంద నృత్యాలు ఆకట్టుకున్నాయి. అందంగా అలంకరించిన ఉత్తమ బతుకమ్మలకు, వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మహిళలు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో వేడుకలను ఉత్సాహంగా ముగించారు.

ఈ కార్యక్రమంలో జీఎంకు సహాయకుడు జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ శాఖ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి ప్రాంత భద్రతా జనరల్‌ మేనేజర్‌ రఘు కుమార్, సీఐఎంఓఏ కార్యదర్శి నరేష్, సీనియర్‌ పర్సనల్‌ అధికారి సురేందర్‌, ఏరియా అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, సేవా సమితి ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.