Take a fresh look at your lifestyle.

రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ ద్రోహం

0 10

కృష్ణా జలాల దోపిడీపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం

మాజీ మంత్రి హరీశ్ రావు

హైద‌రాబాద్ (మెట్రోన్యూస్‌):

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ అడ్డగోలుగా నీటి దోపిడీకి పాల్పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపకపోవడం తెలంగాణ రైతాంగానికి చేస్తున్న తీరని ద్రోహమని మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా హరీశ్ రావు చేసిన పోస్టులో రాష్ట్ర ప్రభుత్వం, కేఆర్ఎంబీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నీటి కేటాయింపులు లేకున్నా.. వరద జలాలు రాకున్నా.. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తుండటం తెలంగాణకు తీరని ద్రోహం అన్నారు.

ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే.. మరోవైపు ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులపై దండెత్తి కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలిస్తోంది. ఒకవైపు కృష్ణా బేసిన్‌లో భాగమైన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టులు ఎండిపోతుంటే.. మరోవైపు బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఏపీ నిబంధనలు ఉల్లంఘిస్తూ, యదేచ్చగా నీటిని తరలిస్తోంది. మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాల్వ.. ఇప్పుడు వెలిగొండ! తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం ఇది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి. కేఆర్ఎంబీపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నింపి, ఆయకట్టుకు నీటి సరఫరా జరిగేలా చూడాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.