Take a fresh look at your lifestyle.

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ మూడోసారి క‌ట్టిన మంత్రి

0 10
  • రాజీ మార్గానికి రాఖీ స‌యోధ్య‌!
  • ముఖ్య‌మంత్రి నివాసానికి కొండా సురేఖ‌

కుమార్తె వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించ‌లేక‌… ఖండించ‌లేక రాజ‌కీయంగా ఇబ్బందిప‌డుతున్న మంత్రి కొండా సురేఖ‌కు రాఖీ పండుగ రాజీ అవ‌కాశాన్ని క‌ల్పించింది. సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసి వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి కొద్దిరోజులుగా… ప్ర‌య‌త్నిస్తున్న సురేఖ‌కు అన్నాచెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్ల అనుబంధానికి ప్ర‌తీక‌గా నిలిచే ర‌క్షాబంధ‌న్ స‌యోధ్య‌కు వేదికైంది. శుక్ర‌వారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయ‌న‌కు రాఖీ క‌ట్టారు. ఆ స‌మయంలో సీఎం స‌తీమ‌ణి, కూతురు, అల్లుడు, మ‌న‌వ‌డూ అక్క‌డే ఉన్నారు. అంద‌ర్నీ సురేఖ ఆప్యాయంగా ప‌ల‌కరించి… పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మ‌రో మ‌హిళా మంత్రి సీత‌క్క కూడా అదే స‌మ‌యంలో రేవంత్‌కు రాఖీ క‌ట్టారు. మొద‌ట సీత‌క్క‌, త‌ర్వాత సురేఖ సీఎంకు రాఖీ క‌ట్టి అభిమానాన్ని చాటుకున్నారు.

ప‌ర‌కాల వివాదం త‌ర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, చివ‌ర‌కు పీసీసీ క్రమ‌శిక్ష‌ణ క‌మిటీ సైతం… ఆమెను త‌ప్పుబ‌ట్టారు. ఇక ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు దాదాపు అంద‌రూ సురేఖ వైఖ‌రిపై మండిప‌డ్డారు. మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేను కలిసినా పెద్ద‌గా ఊర‌ట ల‌భించ‌లేదు. సుస్మిత వ్యాఖ్య‌లు పార్టీకి న‌ష్టం చేసే విధంగా ఉన్నాయ‌నే అధిష్టానం భావించింది. ఆమెపై చ‌ర్య‌కు రంగం సిద్ధ‌మైంద‌నే వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో… రాఖీ పండుగ కొండా ఫ్యామిలీకి గొప్ప‌గా క‌లిసొచ్చింది. రాఖీ పండుగ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పిన మంత్రి కొండా సురేఖ… రాఖీ క‌ట్ట‌డం ద్వారా సోద‌రి త‌న ప్రేమ‌ను, న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తే… సోద‌రుడు ఆమెకు అండ‌గా నిల‌వాల‌నే బాధ్య‌త‌ను స్వీక‌రించే సంప్ర‌దాయం ఈ పండుగ‌లో అంత‌ర్లీనంగా ఉంద‌ని సందేశం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

త‌న సందేశాన్నే స్ఫూర్తిగా తీసుకున్న దేవాదాయ‌, అట‌వీశాఖ మంత్రి కొండా సురేఖ‌… రాఖీ క‌ట్ట‌డానికి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. మీడియాలో ఇదో బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. సీఎం ఆమెకు స‌మ‌యం ఇస్తారా ఇవ్వ‌రా అనేది కాసేపు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కానీ సోద‌ర సోద‌రీమ‌ణుల మ‌ధ్య ప్రేమ‌, అనుబంధాల‌కు ప్ర‌తీకైన పండుగ రోజున ఆమెకు సీఎం నుంచి అపాయింట్‌మెంట్ ల‌భించింది. ముచ్చట‌గా మూడోసారి ముఖ్య‌మంత్రికి మంత్రి సురేఖ రాఖీ క‌ట్టడం విశేషం. ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌క‌పోయినా… సురేఖ ఎలాంటి వివ‌ర‌ణ ఇచ్చే స‌మ‌యం లేక‌పోయినా… వారిద్ద‌రు క‌ల‌వ‌డ‌మే పెద్ద వార్తావిశేష‌మైంది. ఆమెపై గుర్రుగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌… సీఎం రేవంత్ చిరు మంద‌హాసంతో మంత్రుల‌ను ప‌ల‌కిరించడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.