రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి చౌటుప్పల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బాటసింగారం భారత్ పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పెట్రోల్ పోయించుకుంటున్న రెండు వాహనాలను ఢీకొట్టడంతో పాటు పెట్రోల్ బంక్ పరికరాలు ధ్వంసమయ్యాయి. అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల వివరాల ప్రకారం.. బాటసింగారం భారత్ పెట్రోల్ బంక్‌లో గత ఐదేళ్లుగా మేనేజర్‌గా పనిచేస్తున్న బైరూ సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం సుమారు 10:45 గంటల సమయంలో టీఎస్ -11-UA-1188 నంబర్ గల ఆర్టీసీ బస్సు దిల్‌సుఖ్‌నగర్ నుంచి చౌటుప్పల్ వైపు వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్రమంలో పెట్రోల్ పోయించుకుంటున్న TS-26-A-6526 నంబర్ గల షిఫ్ట్ డిజైర్ కారు, TS-07-JA-0657 నంబర్ గల బాలెనో కారును బస్సు ఢీకొట్టింది. అనంతరం బస్సు పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లడంతో ఆయిల్ డిస్‌ప్లే, పెట్రోల్ గన్, పిల్లర్, విద్యుత్ వైర్లు దెబ్బతిన్నాయి.
తప్పిన భారీ అగ్ని ప్రమాదం
అయితే పెట్రోల్ బంకులో భారీ ప్రమాదం తప్పడంతో అక్కడున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో రాపిడి వల్ల గాని, ఒక్కసారిగా పెట్రోల్ బంక్ పరికరాలను బస్సు ఢీకొట్టడంతో చిన్న అగ్గి రవ్వ రాజుకున్న పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం సంభవించి పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యేదాన్ని స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన హైర్ బస్సు డ్రైవర్ ప్రతాప్ రేడ్డీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.