Take a fresh look at your lifestyle.

నిబంధనలు బేఖాతరు.. బాణాసంచా వ్యాపారంలో ఇష్టారాజ్యం!

0 3

జనావాసాల మధ్య టపాసుల విక్రయాలు.. ప్రజల ప్రాణాలకు ముప్పు

అగ్నిమాపక శాఖ పర్యవేక్షణపై అనుమానాలు

మూడు నాలుగు రోజుల్లోనే కోట్ల రూపాయల వ్యాపారం.. పన్నుల ఎగవేతపై ఆరోపణలు

అనుమతుల కోసం 37 దరఖాస్తులు.. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే అనుమతులు: డీఎఫ్‌ఓ

నారాయణపేట ప్రతినిధి, అక్టోబర్ 30 (మెట్రో న్యూస్):

దీపావళి పండుగ నేపథ్యంలో నారాయణపేట జిల్లాలో బాణాసంచా వ్యాపారం ఊపందుకుంది. మూడు నాలుగు రోజుల్లోనే కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుండగా, మరోవైపు భద్రతా నిబంధనల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనావాసాల మధ్య, రద్దీ ప్రాంతాల్లో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రమాదకరమైన బాణాసంచా విక్రయాల విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉండగా, పర్యవేక్షణ లోపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రద్దీ ప్రాంతాల్లో దుకాణాలు.. ప్రమాదాలకు ఆహ్వానం!

పట్టణంలోని ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయడం ప్రమాదకరంగా మారుతోంది. ఇరుకైన వీధుల్లో సైతం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అగ్నిప్రమాదం సంభవిస్తే ఫైర్‌ ఇంజిన్లు చేరుకునే అవకాశం ఉందా? ప్రజలు సురక్షితంగా బయటపడేందుకు తగిన మార్గాలు ఉన్నాయా? అనే అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది. దుకాణాల మధ్య దూరం, అగ్నిమాపక పరికరాలు, నీరు, ఇసుక, విద్యుత్‌ భద్రత వంటి ప్రమాణాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది.

అనుమతుల మంజూరులో పారదర్శకత ఏది?

బాణాసంచా దుకాణాలకు అనుమతులు ఇచ్చే ముందు స్థలం, జనసాంద్రత, రాకపోకలు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. నామమాత్రపు తనిఖీలతో అనుమతులు మంజూరు చేస్తే ప్రమాదాలకు అవకాశం కల్పించినట్లే అవుతుంది. ఈ ఏడాది జిల్లాలో ఎన్ని దుకాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు? ఎక్కడెక్కడ స్థల పరిశీలన చేపట్టారు? భద్రతా ప్రమాణాలను ఎవరు నిర్ధారించారు? అనే వివరాలను అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది.

కోట్ల వ్యాపారం.. పన్నుల చెల్లింపులపై సందేహాలు

దీపావళి సందర్భంగా నారాయణపేట జిల్లాలో బాణాసంచా వ్యాపారం కోట్ల రూపాయల్లో సాగుతున్నట్లు అంచనా. ఒక్క నారాయణపేట పట్టణంలోనే సుమారు రూ.2 కోట్లకు పైగా విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ వ్యాపారంజరుగుతున్నప్పటికీ బిల్లులు, పన్నుల చెల్లింపులపై సంబంధిత వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. బిల్లులు లేకుండా విక్రయాలు జరుగుతున్నాయా? సరుకు కొనుగోలు, అమ్మకాల లెక్కల్లో అక్రమాలు ఉన్నాయా? అనే అంశాలపై తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జీరో దందా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

గోదాముల్లో అక్రమ నిల్వలపై తనిఖీలు ఏవి?

వ్యాపారులు ముందుగానే భారీ మొత్తంలో బాణాసంచా దిగుమతి చేసుకుని గోదాముల్లో నిల్వ చేస్తున్నట్లు సమాచారం. అనుమతులు పొందిన గోదాముల్లో నిర్దేశిత పరిమాణంలో సరుకు ఉంచుతూ, మిగిలిన నిల్వలను ఇతర ప్రాంతాల్లో రహస్యంగా,దాచిపెడుతున్నారనే,ఆరోపణలువినిపిస్తున్నాయి. అనుమతులు లేని ప్రదేశాల్లో భారీగా బాణాసంచా నిల్వ చేస్తే ప్రమాదంసంభవించినప్పుడు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. జిల్లాలోని గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అనుమతులు, నిల్వ సామర్థ్యం, కొనుగోలు బిల్లులు, సరుకు పరిమాణాన్నిపరిశీలించాల్సిన అవసరం ఉంది.

పోలీసుల హెచ్చరికలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా?

అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు నిర్వహించవద్దని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నప్పటికీ,క్షేత్రస్థాయిలో అమలుఎంతవరకుజరుగుతోందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధాన రహదారుల్లో దుకాణాల ఏర్పాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టడం, అన్ని శాఖల అనుమతులు పొందడం వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇప్పటికైనా అధికారులు స్పందించాలి!

బాణాసంచా వ్యాపారంలో భారీగా ఆదాయం వస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దుకాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి. గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు వాణిజ్య పన్నుల శాఖ కూడా వ్యాపార లావాదేవీలను పరిశీలించాలి. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు చర్యలతో నివారించడం ముఖ్యం. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.