Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ను భారతీయ సినిమాకు ప్రధాన కూడలిగా తీర్చిదిద్దుతాం: భట్టి విక్రమార్క

0 86

హైదరాబాద్‌(మెట్రో న్యూస్) :

యువ ఫిలిం మేకర్లు వినోదంతో పాటు సామాజిక బాధ్యతను ప్రతిబింబించే లఘు చిత్రాలను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి సంక్షోభం, విద్యుత్‌ పొదుపు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ యువతలోని సినీ ప్రతిభను ప్రోత్సహిస్తూ హైదరాబాద్‌ను భారతీయ సినిమా పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. శిల్పకళావేదికలో నిర్వహించిన బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్‌ ఛాలెంజ్‌ అవార్డ్స్‌–2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వివిధ రంగుల పూలు ఒకచోట చేరినట్లే సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చే పండుగ బతుకమ్మ అని అన్నారు.

 

మూడు గంటల సినిమాలో చెప్పే కథను రెండు, మూడు నిమిషాల లఘు చిత్రంలో చెప్పడం గొప్ప సృజనాత్మకతతో కూడుకున్నదని పేర్కొన్నారు. అవార్డులు రానంత మాత్రాన యువ దర్శకులు నిరుత్సాహపడవద్దని, తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. యువ సినీ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ గతంలో తెలంగాణ ప్రతిభావంతులకు తగిన అవకాశాలు లేవనే అభిప్రాయం ఉండేదని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన దర్శకులు, నటులు, నిర్మాతలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో హైదరాబాద్‌ను జాతీయ స్థాయి సినీ గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

సినీ రంగ ప్రముఖులను ఆకర్షించడం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా నగరాన్ని భారతీయ సినిమా రంగంలో కీలక కేంద్రంగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సినిమాలు ప్రకృతి పరిరక్షణ, నీటి పొదుపు, విద్యుత్‌ ఆదా వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించే సాధనాలుగా మారాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. వాతావరణ మార్పులు, సూపర్‌ ఎల్‌నినో ప్రభావాలు, వర్షపాతంలో మార్పులపై ప్రజలకు సులభంగా అర్థమయ్యే కథలతో షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించాలని కోరారు. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలో షార్ట్‌ఫిల్మ్‌లు, పాటలు, జానపద గీతాలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, వ్యాసాలు తదితర విభాగాల్లో మొత్తం 29 అవార్డుల ద్వారా యువ ప్రతిభను గుర్తించడం అభినందనీయమన్నారు.

Leave A Reply

Your email address will not be published.