Take a fresh look at your lifestyle.

ఇంటికే కాదు.. ఇక థియేటర్‌ సీటు దగ్గరికే స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ!

0 17
Swiggy food delivery now available at theater seats not just home
  • ‘ఆర్డర్‌-ఇన్‌-సినిమాస్‌’ ఫీచర్‌ ప్రారంభం
  • క్యూఆర్‌ కోడ్‌తో థియేటర్‌ మెనూ యాప్‌లోకి
  • ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ నేరుగా సీటు వద్దకే
  • ఆర్డర్లపై డిస్కౌంట్లు కూడా లభించే అవకాశం
  • సినిమాల ట్రైలర్లు, బుకింగ్‌ వివరాలు కూడా యాప్‌లో

థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్‌ లేదా ఇతర స్నాక్స్‌ కోసం ఇంటర్వెల్‌లో క్యూలో నిలబడాల్సిన అవసరం ఇక ఉండదు. మీరు కూర్చున్న సీటుకే ఫుడ్‌, పానీయాలను డెలివరీ చేసే సదుపాయాన్ని స్విగ్గీ తీసుకొచ్చింది. స్విగ్గీ డైన్‌అవుట్‌ ద్వారా ఈ సేవ అందుబాటులోకి వచ్చింది.

సినీపోలిస్‌, ఏషియన్‌ సినిమాస్‌ సహా పలు మల్టీప్లెక్స్‌ సంస్థల భాగస్వామ్యంతో ‘ఆర్డర్‌-ఇన్‌-సినిమాస్‌’ ఫీచర్‌ను స్విగ్గీ ప్రారంభించింది. దీని ద్వారా థియేటర్‌లోనే ఫుడ్‌, డ్రింక్స్‌ ఆర్డర్‌ చేసుకోవచ్చు. కొన్ని ఆర్డర్లపై డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి.

ఈ సేవను ఉపయోగించడం చాలా సులభం. థియేటర్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. దీంతో స్విగ్గీ డైన్‌అవుట్‌ యాప్‌లో ఆ థియేటర్‌ మెనూ కనిపిస్తుంది. కావాల్సిన ఆహారం, పానీయాలను ఎంచుకుని ఆర్డర్‌ చేయాలి. చెల్లింపు పూర్తయిన తర్వాత ఆర్డర్‌ను నేరుగా సీటు వద్దకే తీసుకొచ్చి అందిస్తారు.

ఇక ఫుడ్‌ ఆర్డర్‌కే పరిమితం కాకుండా కొత్త సినిమాల వివరాలు, ట్రైలర్లు, పోస్టర్లు, బుకింగ్‌ లింకులు, ప్రత్యేక ప్రదర్శనలు, ఈవెంట్లు, ప్రమోషనల్‌ ఆఫర్లను కూడా యాప్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఈ సేవతో థియేటర్‌ నిర్వాహకులకు కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సీటు నుంచే ఆర్డర్‌ చేసే వెసులుబాటు ఉండటంతో ఒక్కో ప్రేక్షకుడి ఖర్చు పెరిగే అవకాశం ఉందని స్విగ్గీ తెలిపింది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గ ఫుడ్‌ కాంబోలు, అదనపు ఐటెమ్స్‌ను సూచించడం ద్వారా విక్రయాలను పెంచుకోవచ్చని పేర్కొంది.

స్విగ్గీ డైన్‌అవుట్‌, సీన్స్‌ సీఈఓ స్వప్నిల్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. ఫుడ్‌ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా సినిమా అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.