Take a fresh look at your lifestyle.

పాక్ హైకమిషన్ వద్ద అధికారుల ఊహించని చర్య.. అనుమతి లేని అక్రమ నిర్మాణాలు ధ్వంసం!

0 13

న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ పరిధి దాటి నిర్మించిన అక్రమ నిర్మాణాలను భారత అధికారులు జేసీబీల సహాయంతో గురువారం తొలగించారు. వీసా విభాగం వెలుపల రహదారిపై ఏర్పాటు చేసిన భద్రతా బారికేడ్లు, క్యూ నిర్వహణ షెడ్లను యంత్రాంగం కూల్చివేసింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ వద్ద పాక్ అధికారులు బారికేడ్లు తొలగించిన మూడు రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో ఈ ఊహించని పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం కాగా.. ఇది ప్రతీకార చర్యేనంటూ ప్రచారం సాగుతోంది.

  • పాకిస్థాన్ హైకమిషన్ వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చేసిన అధికారులు
  • రహదారిపై ఉన్న భద్రతా బారికేడ్లు, వీసా విభాగం షెడ్ల సంపూర్ణ తొలగింపు
  • ఇస్లామాబాద్‌లోని భారత ఎంబసీ బారికేడ్ల తొలగింపునకు ప్రతిచర్యగా ప్రచారం
    Pakistan High Commission Demolition
    పాకిస్థాన్ హైకమిషన్ వద్ద అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చేసిన అధికారులు(ఫోటోలు- ANI)
    Pakistan High Commission Demolition : దేశ రాజధాని న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ భవనం ఎదుటి వరకు బుల్డోజర్లు వెళ్లాయి. గురువారం రోజు ఉదయమే అధికారులు ఊహించని రీతిలో అక్కడ భారీ కూల్చివేత చర్యలు చేపట్టారు. రాజనీతి కార్యాలయానికి కేటాయించిన నిర్ణీత సరిహద్దులను దాటి రహదారిపై ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను, క్యూ-మేనేజ్‌మెంట్ మౌలిక వసతులను అధికారులు తొలగించారు. ఆక్రమణల నివారణ చర్యల్లో భాగంగా జేసీబీ యంత్రాలను రంగంలోకి దించిన యంత్రాంగం.. కాంపౌండ్ బయట ఏర్పాటు చేసిన భద్రతా కటకటాలు, ట్రాఫిక్ బారికేడ్లను పూర్తిగా ధ్వంసం చేసింది.

    భద్రతా ప్రాంగణం కూడా తొలగించిన అధికారులు..!

    పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి చెందిన వీసా విభాగం వద్ద దరఖాస్తుదారుల నియంత్రణ కోసం నిర్మించిన తాత్కాలిక షెడ్లు, క్యూ నిర్వహణ నిర్మాణాలు అనుమతించిన హద్దులకు వెలుపల ఉన్నట్లు అధికారులు గుర్తించారు. యంత్రాంగం చేపట్టిన చర్యల కారణంగా వీసా కౌంటర్ల వద్ద ఉన్న మెటల్ ఫ్రేములు, రేకుల కప్పులు, తెలుపు రంగు లోహపు కంచెలు నేలమట్టం అయ్యాయి. కూల్చివేతల అనంతరం ప్రాంగణం వెలుపల విరిగిపోయిన ఇనుప గేట్లు, తుప్పుపట్టిన లోహపు కడ్డీలు, విరిగిన సిమెంట్ రాళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. వీసా సర్వీస్ కిటికీల చుట్టూ ఉన్న గోడల ప్లాస్టరింగ్ కూడా దెబ్బతింది. అయితే పాకిస్థాన్ జాతీయ చిహ్నం కలిగి ఉన్న ప్రధాన ద్వారం, వెలుపలి కాంపౌండ్ గోడలు భద్రంగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ద్వారా స్పష్టం అవుతోంది.

    ఇస్లామాబాద్ చర్యలకు ప్రతిచర్యగా ప్రచారం?

    ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం వెలుపల పాకిస్థాన్ అధికారులు భద్రతా బారికేడ్లను తొలగించిన సరిగ్గా మూడు రోజుల వ్యవధిలోనే.. ఢిల్లీలోని పాక్ ఎంబసీ వద్ద భారత అధికారులు ఈ చర్యలు చేపట్టడం గమనార్హం. ఇటీవల శ్రీనగర్ పర్యటనకు వెళ్లిన భారత దేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్.. జమ్మూ కాశ్మీర్‌ను “భారత్‌లో అత్యంత ముఖ్యమైన భాగం” అని అభివర్ణించడమే కాకుండా అక్కడ శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశంసలు కురిపించారు.

    ఈ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పాకిస్థాన్.. ఇస్లామాబాద్‌లోని యుఎస్ ఛార్జ్ డి ఎఫైర్స్ నటాలీ బేకర్‌ను పిలిపించి తన నిరసనను వ్యక్తం చేసింది. అయితే అమెరికా రాయబారి వ్యాఖ్యలపై పాక్ నిరసన తెలపడానికి, ఢిల్లీలోని కూల్చివేత చర్యలకు ఏమైనా సంబంధం ఉందా అనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Leave A Reply

Your email address will not be published.