Take a fresh look at your lifestyle.

ఎలాంటి చర్చ లేకుండానే సస్పెండ్ చేస్తారా… మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూధనాచారి

0 27

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

రెండు రోజులు చట్ట సభల్లో జరుగుతున్న తీరు… చీకటి అధ్యాయంగా మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూధనాచారి అభివర్ణించారు. మంగళవారం రాత్రి ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో సహచర ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ సభ్యులపై పోలీసులను ఉసిగొల్పి దుర్మార్గంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిరికితనంతో ఫరారైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దారుణమైన స్థితిలో ఉందన్నారు. దేశ సరిహద్దుల్లో బలగాలను మోహరించినట్లుగా వందలాది మంది పోలీసులను పెట్టించి సభ్యులపై దాడికి పాల్పడిందన్నారు. సోమ‌వారం ప్రభుత్వం వైఫల్యాలను బీఆర్ఎస్ పక్షాన తాము ప్రశ్నిస్తే జవాబు లేదు, కాబట్టే ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సభ నడిపించే ఎత్తుగడను రెండో రోజు కూడా కొనసాగించారని విమ‌ర్శించారు.

బీఆర్ఎస్ మహిళాఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తన, సహచర ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డిలపై కేసులు నమోదు చేయడమేగాకుండా, సభ నుంచి బహిష్కరించేందుకు ఏకపక్షంగా తీర్మానం చేయడంపై తాము చర్చకు పట్టుబట్టగా, సమాధానం చెప్పలేక మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఎదురుచూయించి, వెయిటింగులో పెట్టి, ఎలాంటి చర్చలేకుండా 3 నిమిషాల్లోనే సభను వాయిదా వేసి ఫరారైందని మధుసూదనా చారి దుయ్యబట్టారు. మండలిలో ఇరవై మందికి పైగా సభ్యులున్న బీఆర్ఎస్ పక్షాన్ని, ఏడెనిమిది మంది సభ్యులున్న కాంగ్రెస్ పక్షం తట్టుకోలేక, తీర్మానాన్ని నెగ్గించుకునే అవకాశం లేక, ఆఘమేఘాల మీద చదివి, మూడంటే మూడు నిమిషాల్లోనే పాస్ చేయించుకొని ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించి పరారైందని మండలి ప్రతిపక్షనేత సిరికొండ ఎద్దేవా చేశారు.

Leave A Reply

Your email address will not be published.