Take a fresh look at your lifestyle.

తుమ్మిడిహెట్టిపై త్వరలోనే మహారాష్ట్రతో చర్చలు

0 4

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మాణానికి ఒప్పించేలా వాదనలు

ఏదుల నుంచే డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు నీళ్లు

నీటిపారుదల ప్రాజెక్టుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవలే సూచనప్రాయంగా తెలియజేశారని సీఎం వెల్ల‌డించారు. శుక్రవారం బోధి పెవిలియన్‌లో ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌తో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై పీటముడిగా ఉన్న అంశాలన్నింటినీ ఈ సమావేశంలో చర్చించారు.

తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మిస్తే ఎంత నీటిని తెచ్చుకునే వీలుంది.. 150 మీటర్ల ఎత్తున ఎంత నీటిని ఎల్లంపల్లి వరకు తెచ్చుకునే వీలుందనే వివరాలను ఇరిగేషన్ ఇంజనీర్లు సీఎంకు వివరించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో ఎక్కడ కూడా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేదని వివరించారు. 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే దాదాపు 2300 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని, 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే వెయ్యి ఎకరాల లోపే ముంపు ప్రభావం ఉంటుందని వివరించారు. మహారాష్ట్రలో ముంపు ప్రభావాన్ని అంచనా వేసుకొని, సాధ్యమైనంత నీటిని తెచ్చుకునేందుకు వీలుగా ఈ బ్యారేజీ నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తీసుకోవాలా… ఏదుల నుంచి డిండికి నీటిని తీసుకోవాలనే విషయంలో మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల ప్రతినిధుల అభ్యంతరాలు, విజ్ఞప్తులపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా నార్లాపూర్ నుంచి నీటిని తరలిస్తే ఎంత ఖర్చవుతుంది.. ఏదుల నుంచి నీటిని తీసుకుంటే ఎంత అంచనా వ్యయమవుతుందనే వివరాలన్నీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనుకూలతలు, ప్రతికూలతలన్నింటినీ వివరించారు. మధ్యేమార్గంగా పాలమూరు ప్రాజెక్టు నీటికి ఢోకా లేకుండా డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు నీటిని లిఫ్ట్ చేసేందుకు వీలుగా అదనపు నీటిని తెచ్చుకునే పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు మంత్రులు మద్దతు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.